
సూపర్–6ను తుంగలో తొక్కారు
మార్కాపురం: సూపర్ 6 పథకాలను కూటమి సర్కారు గంగలో కలిపిందని మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో ఓ అంకెల గారడీ అని అన్నారు. చంద్రబాబు సర్కారు మరోసారి తన మోసపూరిత నైజాన్ని చాటుకుందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తామని చెబుతూనే బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అరకొరగా చేశారని అన్నారు. ఈ రెండు పథకాల్లో భారీగా లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెలా రూ.15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, దీనికి బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు బడ్జెట్‌లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని, దీనితో లక్షలాది మంది మహిళలను చంద్రబాబు ఎప్పటిలాగే మోసం చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో అప్పటి సీఎం జగన్‌కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు చివరికి మానిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలుచేయలేని దుస్థితికి వచ్చారన్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని ఈ బడ్జెట్‌తో మరోసారి రుజువైందని జంకె చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, గత బడ్జెట్‌లో రూ.399 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. కేవలం నిర్వాసితులను తరలించేందుకే రూ.800 కోట్లు ఖర్చవుతుందని, ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ.2 వేల కోట్లు అవసరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, ప్రాజెక్టులను సందర్శించి, సమీక్షలు జరిపి కేవలం బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయించారన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు పనులు ఏవిధంగా పూర్తవుతాయని జంకె ప్రశ్నించారు.
వెలుగొండకు నిధులెక్కడ ?
మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment