బడ్జెట్లో వెలుగొండకు అరకొర నిధులు అన్యాయం
● నిరసన ప్రదర్శనలో సీపీఎం నాయకులు
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్లో జిల్లాకు తలమానికం లాంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అరకొర నిధులు కేటాయించడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చీకటి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని సాగర్ సెంటర్లో శనివారం బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా కేవలం రూ.359 కోట్ల నిధులు కేటాయించడం అంటే జిల్లా ప్రజలను అవమానపరచడమేనని స్పష్టం చేశారు. బడ్జెట్‌ను సవరించి కనీసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తేనే కానీ 2026 నాటికి ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించడాన్ని బట్టి చూస్తే ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఉద్దేశం కనిపించడం లేదన్నారు. కూటమి సర్కార్ తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆంధ్రకేసరి యూనివర్శిటీకి కానీ, విమానాశ్రయానికి, నగరాభివృద్ధికి, హార్బరు అభివృద్ధికి నయాపైసా కూడా వెచ్చించలేదని విమర్శించారు. జిల్లాకు నిధులు తీసుకొరావడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారన్నారు. కూటమి తరఫున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికై నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొనిరావాలన్నారు. గత ప్రభుత్వం 25 వేలమంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో సవరణలు చేసేంత వరకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.ఆదిలక్ష్మి, జి.రమేష్, ఎస్డీ హుసేన్, మాలకొండయ్య హనుమంతరావు, సుబ్బారావు, సుబ్బారెడ్డి, కేఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment