
క్రికెట్ బుకీలు జంప్
● జరుగుమల్లి యువకుడు పరారీతో బట్టబయలైన బెట్టింగ్ బాగోతం
● పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు?
● క్రికెట్ బెట్టింగ్‌పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు
సింగరాయకొండ: క్రికెట్ బెట్టింగ్‌లో జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామానికి చెందిన యువకుడు బత్తిన అశోక్ నగదు పోగొట్టుకుని ఇంటి నుంచి పరారైన ఘటనతో క్రికెట్ బెట్టింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లోని క్రికెట్ బుకీల వెన్నులో దడపుట్టించింది. ఈ వ్యవహారం ఎస్పీ ఏఆర్ దామోదర్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఆదేశాలతో ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేయటంతో క్రికెట్ బుకీలు జంప్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల ప్రకారం... పైడిపాడు గ్రామానికి చెందిన అశోక్ క్రికెట్ బెట్టింగులు ఆడి భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో క్రికెట్ బుకీలకు డబ్బులు కట్టలేక ఇంట్లో చెప్పలేక చివరకు ఈ నెల 20వ తేదీ ఉదయం హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతను చివరిసారిగా ఆ గ్రామానికి చెందిన క్రికెట్ బుకీ తన్నీరు తేజతో ఫోన్ మాట్లాడినట్లు తెలుసుకున్న అశోక్ బంధువులు జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 21వ తేదీ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మండలంలో జరుగుతున్న బెట్టింగ్ విషయం బట్టబయలైంది. ఈక్రమంలో అశోక్ బంధువులు ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి అశోక్ పారిపోవటానికి గల కారణాలను వివరించారు. గత నెల 23వ తేదీ సాయంత్రం అశోక్ తన బంధువులకు ఫోన్ చేసి మీరు భయపడవద్దని తాను తిరుపతి సమీపంలో ఉన్నానని ఇంటికి వస్తున్నానని చెప్పి మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో జరుగుమల్లి పోలీసులు అశోక్ ను తహశీల్దార్ వద్ద హాజరు పరచి అతను ఇంటి నుంచి వెళ్లిపోవటానికి గల కారణాలను రాత పూర్వకంగా నమోదు చేశారు. తరువాత పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు. సీఐ హజరత్తయ్య పర్యవేక్షణలో జరుగుమల్లి ఎస్సై బీ మహేంద్ర ఆధ్వర్యంలో విచారణ సాగుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లో క్రికెట్ బుకీల కోసం వేట మొదలు పెట్టి సుమారు 15 మంది వరకు బుకీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. వీరిలో ప్రధానంగా సింగరాయకొండ కు చెందిన రెస్టారెంట్ యజమాని, అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తీవ్రమైంది. ఇటీవల ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి కందుకూరు ఫ్‌లైఓవర్ జంక్షన్ బెట్టింగు రాయుళ్లకు అడ్డాగా మారిందని, ఆ ప్రాంతంలోని హోటళ్ల వద్ద కూర్చొని బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం. ఇటీవల కాలంలో తమ పిల్లలు లక్షలకు లక్షలు బెట్టింగులో పోగొట్టుకుంటున్నారని, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని ఇకనైనా బెట్టింగు జాడ్యానికి పోలీసులు ముగింపు పలకాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదివారం ఇండియా– న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నా కందుకూరు ఫ్లై ఓవర్ జంక్షన్ ప్రాంతం బోసిపోయింది. క్రికెట్ బుకీలు ఇతర రాష్ట్రాలకు పరారై తలదాచుకుంటున్నారు. దీనిపై సీఐ హజరత్తయ్యను వివరణ కోరగా...అనుమానితులను విచారిస్తున్నామని, ఎవ్వరినీ అదుపులోనికి తీసుకోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment