
ప్రమాదంలో పోస్టాఫీసుల ఉనికి
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా పోస్టాఫీసుల ఉనికి ప్రమాదంలో పడిందని , కార్మికుల భవిష్యత్‌ను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. తపాలా శాఖలో జరుగుతున్న పెను మార్పులపై సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు తపాలా శాఖను సేవారంగంగా పరిగణించాయని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తపాలా శాఖను వ్యాపార సంస్థగా మార్చి వేస్తుందన్నారు. రానున్న రోజుల్లో తపాలా శాఖను మూడు విభాగాలుగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మెయిల్ డెలివరీ విభాగాలుగా తపాలా శాఖను విడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, దీని వల్ల తపాలా ఉద్యోగులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు తపాలా కార్మికులు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. సదస్సులో ఎన్‌ఈపీఈ జిల్లా కార్యదర్శి ఏ.హరిబాబు, ఏఐజీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎం. పోలయ్య, మహిళా నాయకులు డి. శ్రీలక్ష్మి, కె.ప్రసన్న, జీవీ సుబ్బారావు, కొప్పోలు వెంకటేశ్వరరావు, దర్శి మోహన్‌రావు, పాతం శెట్టి పేరయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జి.శ్రీనివాసులు, దామా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment