
అరకొర నిధులతో వెలుగొండను ఎలా పూర్తి చేస్తారు?
కొండపి: వెలుగొండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి 2027 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో అరకొరా నిధులు కేటాయించి ప్రకాశం జిల్లా ప్రజల ఆశల మీద నీళ్లు చెల్లిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు విమర్శించారు. మండల కేంద్రమైన కొండపి బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన ఆదివారం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని, రూ.1458 కోట్లతో మొదటి దశ 2027 నాటికి పూర్తి చేస్తామని వెలుగొండ ప్రాంతంలో పర్యటించిన నీటిపారుదల శాఖ మంత్రి ఇటీవల ప్రకటించారని అన్నారు. బడ్జెట్లో పాలేటిపల్లె రిజర్వాయర్, సంగమేశ్వరం ప్రాజెక్టు, ప్రస్తావనే లేదని, దొనకొండ కారిడార్ కనిగిరి నిమ్స్, ఒంగోలు విమానాశ్రయం, పరిస్థితి ఏమిటి అనేది ప్రభుత్వం ప్రస్తావించలేదని అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేని స్థితిలో రైతులుంటే కేవలం రూ.300 కోట్లతో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమని పంటల పండగ ఎలా చేస్తారని ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ కలగా మారిందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, మహాలక్ష్మి పథకం లాంటి ఎన్నికల నాటి పథకాలన్నీ కనుమరుగు చేసేలా బడ్జెట్ ఉందని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్, జిల్లా నాయకురాలు కంకణాల రమాదేవి, వి.మోజస్, మండల కార్యదర్శి మల్లెల కొండయ్య, బ్రహ్మయ్య, చిన్న పేతురు, బ్రహ్మయ్య, వందనం, పెద్ద పేతురు, నిర్మల, ప్రేమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలను నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడుకంకణాల ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment