● ప్రకాశం ఎస్పీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ● ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జీవించి ఉన్న ఓటర్లు మృతి చెందినట్లుగా పేర్కొంటూ ఫారం–7తో ఓట్ల తొలగింపునకు పాల్పడటంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం ఎస్పీ నేతృత్వంలో మరో ఇద్దరు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి ఆధారంగా సిట్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. 24,000 ఓట్లు తొలగింపునకు పారం–7 దరఖాస్తులను అక్రమంగా చేశారని, జీవించి ఉన్న వారు మృతి చెందినట్లు పేర్కొన్నారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే ఎటువంటి చర్యలను తీసుకోలేదని, దీనిపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్యే కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్‌తోపాటు డీజీపీ ద్వారా మరో అధికారిని నియమించుకుని దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐడీ డీజీ ఆదేశాలు, పర్యవేక్షణలో సిట్ పనిచేయాలని పేర్కొన్నారు. సిట్ సాక్షులను, పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు చట్టానికి లోబడి నిందితులను అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు త్రైమాసిక నివేదికను సిట్ సమర్పించాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment