
కూతుర్ని చూసేందుకు వచ్చి..
ఒంగోలు టౌన్: విధి విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. కూతుర్ని చూడాలని వినుకొండ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ వృద్ధురాలు అదే బస్సు ఢీకొనడంతో మృతి చెందింది. సోమవారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చేవూరి నాగేంద్రమ్మ (69)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో సంతానమైన నాగమణి సంతనూతలపాడు మండలంలోని బోడపాలెంలో నివసిస్తోంది. నాగేంద్రమ్మ తరచూ కూతురిని చూసేందుకు వచ్చివెళ్తుంటుంది. వినుకొండలో ఆమెను బస్సు ఎక్కించి ఒంగోలు పంపడం.. కూతురు నాగమణి ఒంగోలు వచ్చి తల్లిని బోడపాలెం తీసుకెళ్లడం జరుగుతుంటుంది. అయితే, ఈసారి మాత్రం విధి ఆడిన ఆటలో ఆ తల్లి కూతురి వద్దకు చేరలేదు. ఒంగోలులోనే తిరిగిరాని లోకాలకు చేరింది. వినుకొండ నుంచి ఒంగోలుకు ఆమె వచ్చిన ఆర్టీసీ బస్సే రివర్స్ చేస్తూ.. అప్పుడే బస్సు దిగి వెనుక నుంచి వెళ్తున్న నాగేంద్రమ్మను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటికే నాగమణి ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చి తల్లి కోసం ఎదురుచూడసాగింది. ఆ సమయంలో ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. సమీపంలో జనం గుమిగూడి ఉన్నారు. దాంతో డిపోలో నిలబడి ఉన్న ప్రయాణికులను అక్కడ ఏం జరుగుతోందని నాగమణి అడిగింది. ఎవరో ముసలావిడి చనిపోయిందని చెప్పడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, నాగేంద్రమ్మ నిర్జీవంగా పడి ఉంది. ఊహించని ఘటనతో నివ్వెరపోయిన నాగమణి.. తల్లి మృతదేహం మీద పడి విలపించడం అక్కడున్న వారితో సైతం కన్నీరు పెట్టించింది. నాగేంద్రమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే వినుకొండ టీడీపీ నాయకులు పలువురు ఒంగోలు చేరుకుని కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులు, బాధితులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి వినుకొండ నుంచి ఆర్టీసీ బస్సులో ఒంగోలు రాగా, అదే బస్సు రివర్స్ చేస్తూ ఢీకొని దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment