
ఇసుక ఇజం!
పచ్చ సైన్యం..
జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. కూటమి పార్టీల నేతలు బరితెగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు. ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడ నుంచి ఇసుక తెచ్చుకున్నా మా యార్డులో దించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. బలవంతంగా యార్డులో దించుతున్నారు. కాదంటే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో జరుగుతుండటంతో సంబంధిత శాఖల అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. సహనం నశించిన లారీ యజమానులు సోమవారం ఏకంగా ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇసుక మాఫియా దౌర్జన్యాలకు తెగబడుతోంది. పట్టపగలే రెచ్చిపోయి రౌడీయిజం చేస్తోంది. నగరంలోని కొప్పోలు హైవే వద్ద ఇసుక యార్డు ఏర్పాటు చేశారు. నెల్లూరు రీచ్ నుంచి ఇక్కడకు ఇసుక తరలించి విక్రయాలు జరుపుతుంటారు. జిల్లాలో కొందరు టిప్పర్ యజమానులు పదేళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఒంగోలు, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, పొదిలి, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో ఇసుక విక్రయాలు చేస్తుంటారు. గృహనిర్మాణదారులు నేరుగా ఆన్‌లైన్లో ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో వారికి తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తున్నారు. టిప్పర్ యజమానులు టన్నుకు రూ.600 తీసుకుంటుండగా యార్డులో మాత్రం టన్నుకు రూ.850కిపైగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గృహనిర్మాణదారులు అనేకమంది స్వయంగా ఆన్‌లైన్‌లోనే ఇసుక బుక్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి బిల్లులతో ఒంగోలుకు తరలిస్తున్నారు. దీనిని సైతం ఇసుక మాఫియా అడ్డుకుంటోంది. 100 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి నగరంలో సొంతంగా నిఘా పెట్టి దాడులకు పాల్పడుతోంది. నగరంలోని గుంటూరు రోడ్డు బైపాస్‌లో కిమ్స్ హాస్పిటల్ వద్ద ఒక బ్యాచ్, నెల్లూరు రోడ్డులోని బైపాస్ వద్ద సంఘమిత్ర హాస్పిటల్ వద్ద ఒక బ్యాచ్, కర్నూలు రోడ్డు ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద మరొక బ్యాచ్‌తో నిఘా పెడుతున్నారు. నెల్లూరు నుంచి బిల్లులతో వచ్చే లారీలు, టిప్పర్లను అడ్డుకుని డ్రైవర్లను చితకబాది భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బలవంతంగా లారీలను తీసుకెళ్లి యార్డులో ఇసుక డంప్ చేసుకుంటున్నారని టిప్పర్ యజమానులు వాపోతున్నారు.
పోలీసుల నో యాక్షన్...
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఒక్క ఒంగోలులోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇసుక మాఫియా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్పప్పటికీ పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఒంగోలులో 100 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని టిప్పర్ యజమానులు, గృహనిర్మాణదారులపై దాడులకు పాల్పడుతున్నా.. మాకేమీ తెలియదని చెబుతున్నారంటే పోలీసుల మీద అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. టిప్పర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోగా ఎదురుగా తమనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కరి మీదైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుకాసురులు ప్రైవేటు సైన్యంతో నిఘా పెట్టి మరీ వేధింపులు వ్యాపారులపై దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం కార్గిల్ సైనికుడిని సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్న ఇసుకాసురులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన టిప్పర్ యజమానులు
Comments
Please login to add a commentAdd a comment