
ఆప్కాస్ రద్దుపై భగ్గుమన్న కార్మికులు
● కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా
ఒంగోలు టౌన్: ఆప్కాస్‌ను రద్దు చేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయంపై కార్మికులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికుల జీవితాలను కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాలపై మండిపడ్డారు. కోవిడ్ ఆపద సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన మున్సిపల్ కార్మికుల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని కార్మిక నాయకులు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎస్‌డీ సర్దార్ మాట్లాడుతూ ఆప్కాస్‌ను రద్దు చేయాలన్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అసలుకే ఎసరు పెట్టే చర్యలకు ఉపక్రమించడం దుర్మార్గం అన్నారు. కనోనా సమయంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలను మరిచి పోవడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కార్మికులపై రాజకీయ జోక్యాన్ని నిలువరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను ప్రైవేటు కాంట్రాక్టులకు అప్పగిస్తే జీతాలు, పీఎఫ్‌లు సక్రమంగా రావని, కార్మిక హక్కులను కాలరాస్తారని చెప్పారు. కార్మిక వర్గం శ్రమదోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురిచేయడం ఎక్కువై పోయిందని యూనియన్ జిల్లా నాయకుడు శ్రీరామ్ శ్రీనివాసరావు విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఆప్కాస్‌ను రద్దు చేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు ఆదినారాయణ, హరిబాబు, ఎంఏ సాలార్, చెన్నయ్య, వెంకటేశ్వర్లు, గోపి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను ప్రైవేటు నరకంలోకి నెట్టొద్దు: సీఐటీయూ డిమాండ్
ఆప్కాస్‌ను రద్దు చేసి కార్మికులను ప్రైవేటు నరకంలోకి నెట్టొద్దని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం యూనియన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ విజన్ అంటూ గొప్పలు చెబుతోందని, కార్మికులు పనిచేయకపోతే స్వచ్చ ఆంధ్ర ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడతారని చెప్పారు. సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలని, ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ విజయవాడలో జరిగే ధర్నాలో జిల్లా కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టి.మహేష్, విజయమ్మ, కె.సామ్రాజ్యం, ఎం.బాబు, దివ్య, జేమ్స్, భారతి, కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment