గ్రామ కంఠంలో పచ్చ గద్దలు
పీసీపల్లి:
అధికారమే అండగా పచ్చ తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. భూ బకాసురుల అవతారమెత్తి ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు యంత్రాలతో చదును చేసి యథేచ్ఛగా ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలం పెద ఈర్లపాడులో టీడీపీ నాయకులు విలువైన గ్రామ కంఠం భూమిని కబ్జా చేసి వెంచర్‌గా మార్చిన వైనంపై కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. భూ ఆక్రమణను అడ్డుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది.
పెద ఈర్లపాడు గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 870లోని 4 సబ్ డివిజన్లలో మొత్తం 11 ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఇందులో 870/2లో 1.18 ఎకరాల భూమిలో చెరువు కాలువ ఉంది. అయితే 870, 870/1, 870/3, 870/4లో ఖాళీగా ఉన్న 9.82 ఎకరాల గ్రామ కంఠం భూమిని టీడీపీ నేతలు ఆక్రమించి వెంచర్ వేశారు. దీని విలువ ఇప్పుడు సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వాస్తవానికి ఈర్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు గతంలోనే ఈ భూమిలో చెట్లు, చిల్లకంప తొలగించి చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూమిపై టీడీపీ నాయకులు మళ్లీ కన్నేశారు. అడిగేవారు లేరన్న అధికార మదంతో గ్రామ కంఠాన్ని ఆక్రమించి ఏకంగా వెంచర్ వేశారు. దీనిపై ప్రశ్నించిన స్థానికులపై బెదిరింపులకు దిగడంతో పంచాయితీ కలెక్టర్ వద్దకు చేరింది.
భూ ఆక్రమణపై ఈవోఆర్డీ మల్లేశ్వరిని వివరణ కోరగా.. ‘గతంలో గ్రామ కంఠం స్థలం ఆక్రమణకు గురైన విషయం వాస్తవమే. అప్పుడు ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. ఇటీవల కొంత మంది అదే భూమిని మళ్లీ చదును చేసి వెంచర్ వేస్తుండగా సోమవారం హెచ్చరిక బోర్డు పెట్టించాం’ అని తెలిపారు.
పీసీపీల్లి మండలం పెద ఈర్లపాడులో టీడీపీ నేతల భూ కబ్జా
రూ.3 కోట్ల విలువైన 9.82 ఎకరాల భూమిని చెరబట్టిన పచ్చ ముఠా
దర్జాగా వెంచర్ వేసి బిట్లు బిట్లుగా విక్రయించేందుకు పక్కా స్కెచ్
రెవెన్యూ అధికారుల హెచ్చరికలనూ లెక్కచేయని వైనం
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి భూమిని కాపాడాలని కోరిన గ్రామస్తులు
గ్రామ కంఠంలో పచ్చ గద్దలు
గ్రామ కంఠంలో పచ్చ గద్దలు
Comments
Please login to add a commentAdd a comment