పని కావాలంటే.. చేయి తడపాల్సిందే!
సంతనూతలపాడు:
కూటమి ప్రభుత్వం కొలువయ్యాక సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. కొందరు రెవెన్యూ అధికారులు పైసా ముట్టజెప్పందే.. పని చేయని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ ఇతరత్రా సర్టిఫికెట్లు కావాలంటే కొంత మంది అధికారులు వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపులు చెల్లిస్తే తప్ప భూమి సర్వే దరఖాస్తుల వైపు కన్నెత్తి చూడటం లేదని అర్జీదారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కార్యాలయంలో ఏ పనీ కావడం లేదంటూ తరచూ బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం కార్యాలయంలో జరుగుతున్న పలు కార్యకలాపాలపై ఉద్యోగుల మధ్యే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
కొందరు ఉద్యోగులకే ప్రాధాన్యతను ఇస్తూ...
కార్యాలయంలో కొందరు ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో సానుకూలంగా ఉన్న అధికారులు ధ్రువీకరించిన సర్టిఫికెట్లకు ఆమోదం తెలపడం, సానుకూలంగా లేని అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను తిరస్కస్కరిస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఉద్దేశపూర్వకంగానే కొర్రీలు పెడుతూ కుల ధ్రువీకరణ పత్రాలను పెండింగ్‌లో ఉంచుతుండటంతో విద్యార్థులు, ఇతర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వీఆర్‌వోల విషయంలో కూడా కొందరికే ప్రాధాన్యతను ఇస్తూ పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో సముచిత గౌరవం దక్కడం లేదని కూటమి ప్రజాప్రతినిధులు సైతం నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓ వీఆర్‌ఏ అన్నీ తానై వ్యవహరిస్తూ, పనులు చేయిస్తామని దరఖాస్తుదారుల నుంచి పెద్దమొత్తంలో నగదు గుంజుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సామాన్యులకు సవాలక్ష కొర్రీలు
రెవెన్యూపరమైన సమస్యలపై కార్యాలయానికి వెళ్లే సామాన్యులను సవాలక్ష కొర్రీలతో అధికారులు తిప్పలు పెడుతున్నారు. అదే రూ.లక్షల్లో ముడుపులు వస్తాయంటే నిబంధనలు సైతం వారు తుంగలో తొక్కి తామే స్వయంగా ఫీల్డుకు వెళ్లి అప్పనంగా వారికి కట్టబెట్టేందుకు సైతం వెనుకాడడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో భూముల రీసర్వే సైతం అట్టకెక్కింది. రీసర్వేను పర్యవేక్షించి గాడిలో పెట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడడం లేదన్న ఆరోపణలున్నాయి.
అవినీతికి కేరాఫ్‌గా సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం
అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఓ వీఆర్‌ఏ
భూ సమస్యలు, ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజల ప్రదక్షిణలు
కార్యాలయ ఉద్యోగులపైనా పక్షపాతం
చూపుతున్నట్లు ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment