రామతీర్థం అందించవా స్వామీ..!
మర్రిపూడి:
విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంతో 11 గ్రామాలకు 13 రోజులుగా నీటిసరఫరా నిలిచిపోయింది. మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న మర్రిపూడి మండలంలోని 32 గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీరందిస్తున్నారు. జిల్లాలోని పశ్చిమప్రాంతం అత్యంత ఫ్లోరైడ్ ప్రాంతంగా గుర్తించి వారికి శుద్ద జలాలు అందించే లక్ష్యంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రామతీర్థం రిజర్వాయర్ నుంచి రూ.5 కోట్లు వెచ్చించి ఫిల్టర్ బెడ్‌లలో రోజుకు 2 లక్షల లీటర్‌లు శుద్దిచేసి పైపులైన్ ద్వారా ఈ నీటిని అందిస్తున్నారు. అయితే ఆ లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నీరు కారుస్తోంది. ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద మండలంలోని రూరల్ గ్రామాలకు త్రీఫెస్ విద్యుత్ సరఫరా అందించేందుకు నూతన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. నూతన స్తంభాల ఏర్పాటు కోసం గుంతలు తీశారు. ఈ క్రమంలో దాదాపు 9 ప్రదేశాల్లో తాగునీటి పైపులు పగిలిపోయి నీరు వృథాగా పోతున్నాయి. లీకులు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారాయి. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖాధికారులు తాగునీటి సరఫరాను ఆయా గ్రామాలకు నిలిపేశారు. దీంతో మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం, వల్లాయపాలెం, చిమట, పాత పన్నూరు, కొత్తపన్నూరు, శివరాయునిపేట, కాకర్ల, చిలంకూరు, కూచిపూడి, మర్రిపూడి, ఏలూరు గ్రామాలకు 13 రోజులుగా రామతీర్థం నీరు నిలిచిపోయింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీరు అందకపోవడంతో బోరునీరు, బబుల్స్ వాటర్‌ను మండల వాసులు ఆశ్రయిస్తున్నారు. ఆ నీరు తాగడం వల్ల జలుబు, జ్వరాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. మండలంలోని శివరాయునిపేట నుంచి కాకర్ల మీదుగా చిలంకూరు గ్రామానికి త్రిఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకు నూతన విద్యుత్ స్తంభాలతోపాటూ, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులైన్‌లు పగిలిపోయాయని, లీకులకు కొంత పరిహారం చెల్లించాలని గ్రామ నీటి సరఫరా అధికారులు విద్యుత్ శాఖాధికారులను డిమాండ్ చేశారు. అయినా విద్యుత్‌శాఖాధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్ పై మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ తెలిపారు. రెండు శాఖల అధికారులను ఒప్పించాలన్న ఎస్‌ఐ సురేష్‌బాబు ప్రయత్నం ఫలించలేదు. మండల స్థాయి అధికారులు నేటికీ తాగునీటి సమస్యపై పరిష్కారం చూపలేదు. మంత్రి సొంత నియోజకవర్గంలో దాదాపు 13 రోజులుగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండుతున్న తరుణంలో తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.
11 గ్రామాలకు 13 రోజులుగా నిలిచిన రామతీర్థం నీరు విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పగిలిన తాగునీటి పైపులు విద్యుత్ కాంట్రాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
రామతీర్థం అందించవా స్వామీ..!
రామతీర్థం అందించవా స్వామీ..!
Comments
Please login to add a commentAdd a comment