ఒంగోలు సిటీ: జిల్లాలో మార్చిలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్స్ ను ప్రధానోపాధ్యాయులు వారి స్కూల్ లాగిన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మొదటిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం హాల్‌టికెట్స్ ను వాట్స్‌యాప్ యాప్, మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) ద్వారా పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. హాల్‌టికెట్స్‌లో పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫొటో, సంతకం, సబ్జెక్టు మిస్ మ్యాచ్ ఉంటే సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంటనే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ పరీక్షల విభాగం వారికి ఈ మెయిల్ dirgovexamr@yahoo.com ద్వారా తెలియజేయాలని కోరారు.
హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ ఖైదు
ఒంగోలు: హత్యకేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలు 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన షేక్ ఖాశింపీరా(63) తన కుమారుడు షేక్ ఖాశిం సాహెబ్‌తో కలిసి టెంట్ హౌస్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో బేల్దారి పనులకు సంబంధించి ఖాశింపీరా తమ్ముడు జిలాని, అదే గ్రామానికి చెందిన మజున్సా నయబా మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మజున్సా నయబాను ఖాశిం పీరా మందలించాడు. అనంతరం 2017 జనవరి 15న ఖాశిం పీరా మరో తమ్మునితో గొడవపడి కొట్టడంతో ఖాశింపీరా, ఆయన కుమారుడు కలిసి మజున్సా నయబాను మందలించారు. దీనిపై కక్ష పెట్టుకున్న మజున్సా నయబా తమ బంధువులైన మజున్సా రసూల్, మజున్సా బాబు, మజున్సా ఖాజా, మజున్సా మస్తాన్ అలియాస్ మస్తాన్ సాహెబ్ అనే వారితో కలిసి అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో టెంట్ హౌస్ మూసివేసి ఇంటికి వెళుతున్న ఖాశింపీరా, ఆయన కుమారుడు మహబూబ్‌బాషాలపై కత్తి, క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన ఖాశింపీరా వైద్య చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన కుమారుడు మహబూబ్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పామూరు ఎస్సై సాంబశివరావు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.రాజేష్ విచారణ చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితులు ఐదుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున జరిమానా విధిస్తూ 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు తీర్పునిచ్చారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సిబ్బందిని, కేసును వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతికుమారిని, సీఐ ఎం.రాజేష్, ఎస్సై సాంబశివరావులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.
పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌కు..
● వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు
● చికిత్స పొందుతూ మృతి
రాచర్ల: పురుగుల మందుతాగిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంఘటన మండల కేంద్రమైన రాచర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలకు సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన పిక్కిలి చెన్నరాయుడు(58) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వెంటనే స్థానిక రాచర్ల పోలీస్ స్టేషన్ వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక పోలీసులు వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని వెంటనే పోలీస్ వాహనంలోనే గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు వెంటనే గిద్దలూరు ఏరియా వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిక్కిలి చెన్నరాయుడుకి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పిక్కిలి చెన్నరాయుడికి రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి భార్య అతడిని వదిలేయడంతో చిన్న కుమారుడి దగ్గర ఉంటున్నాడు. ఈక్రమంలో కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన చెన్నరాయుడు పురుగులమందు తాగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment