
ఊరిస్తున్న ధరలు..!
పొగాకు రైతును
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో 24 వేల బ్యారన్‌ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. 2025–26 సీజన్‌కు సంబంధించి 105.27 మిలియనన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని పరిశీలిస్తే 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్‌లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటక మార్కెట్ సరాసరి రూ.268
ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలంలో ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని అక్కడ రైతులు అంటున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తం కేజీ పొగాకు సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు వచ్చింది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు రూ.300లకు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
గ్రేడింగ్‌లో జాగ్రత్తలు అవసరం..
ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రేట్‌గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెప్తున్నారు. మిగిలిన గ్రేడ్ కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని, గ్రేడ్‌లు వేరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని సూచిస్తున్నారు.
10 నుంచి వేలం ప్రారంభం:
ఈ నెల 10వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో పొగాకు వేలం ప్రారంభం కానుంది. కందుకూరు–1వ వేలం కేంద్రంతో పాటు ఒంగోలు–1, కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన ఏడు వేలం కేంద్రాల్లో కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లితో పాటు ఒంగోలు–2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వేలం ప్రారంభమయ్యాకే ధరలపై అంచనా
ఈనెల 10వ తేదీ నుంచి ఈ సీజన్‌కు సంబంధించి అధికారికంగా పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభించనున్నాం. మొదటి దశలో నాలుగు వేలం కేంద్రాలు, 19వ తేదీ మిగిలిన వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభిస్తాం. ఈ ఏడాది ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు ఖర్చులకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేలం ప్రారంభమైన తరువాత ధరలపై ఒక అంచనాకు రాగలం.
– లక్ష్మణరావు, ఆర్‌ఎం
భారీగా పెరిగిన సాగు ఖర్చులు..
పొగాకు రైతులు పోటీ పడడంతో పొలాల, బ్యారన్ కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది లక్ష రూపాయలు ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2.50 లక్షలకు పెరిగింది. ఇలా పొలం కౌలు, కూలీల రేట్లు అన్నీ రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారన్‌కు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చు అయిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకు సరాసరి ధరను రూ.300లకు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ పొగాకు సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. అంటే ఈ ఏడాది అదనంగా దాదాపు రూ.50 వరకు సరాసరి ధర పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ ఏడాది మార్కెట్ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
భారీగా పెరిగిన సాగు ఖర్చులు గత ఏడాది కంటే ఎక్కువ రేటు వస్తేనే లాభాలు సరాసరి రూ.300 ఇవ్వాలని రైతులు డిమాండ్ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం
Comments
Please login to add a commentAdd a comment