
అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడండి
పామూరు: అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం కస్టమర్లకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కట్టకిందపల్లెవద్ద అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ తోటలను, ఇటీవల నరికివేతకు గురైన జామాయిల్ పొలాలను బుధవారం క్షేత్రస్థాయిలో స్థానిక సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మీనారాయణ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి 19.52 లక్షల మంది చేసిన డిపాజిట్‌లను తిరిగి చెల్లించాలని 2015 నుంచి అసోసియేషన్ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 24 వేల ఎకరాలను ప్రభుత్వం ఆటాచ్ చేసిందన్నారు. అధికార పార్టీవారు అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొడుతున్నారని, జామాయిల్‌ను యథేచ్ఛగా కొట్టి రూ.కోట్లు దండుకుంటున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్‌కు చెందిన పొలాల్లోని జామాయిల్, ఎర్రచందనం నరికించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా కాపాడేవారు లేకపోవడం హేయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.20 వేల లోపు డిపాజిట్ ఉన్న సుమారు 10.50 లక్షల మందికి నగదు చెల్లించిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 45 రోజుల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్‌చేశారన్నారు. నేడు మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ కస్టమర్లకు న్యాయం చేస్తామని ప్రకటించి ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినా నేటికీ దానిపై పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ నాడు అగ్రిగోల్డ్ మూతబడిన తరువాత జిల్లాలో 6,500 ఎకరాలు సీజ్‌చేశారని, కట్టకిందపల్లెలో 357 ఎకరాలు పొలాలు ఉన్నాయని వీటిలో జామాయిల్ సాగు ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కస్టమర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఇవ్వాల్సిన పనిలేదని అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మితే అంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ మౌలాలి, మండల కార్యదర్శి పోతల ప్రభాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి కొండారెడ్డి పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment