
వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువా..
● ఒంగోలు రెడ్డి హాస్టల్ ముందు టీడీపీ కార్యకర్తలు, ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల హల్‌చల్
ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కండువా వేసిన ఘటన ఒంగోలులో బుధవారం సాయంత్రం జరిగింది. ఒంగోలు మామిడి పాలెం వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు, ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సాయంత్రం 4 గంటల సమయంలో టీడీపీ కండువా వేశారు. అనంతరం విగ్రహం సమీపంలోనే టీడీపీ జెండా పెట్టారు. హాస్టల్ ప్రహరీ గేటు పక్కన ఉన్న విద్యుత్ లైట్‌ను ధ్వంసం చేశారు. కొంత సేపు అక్కడే నినాదాలు చేస్తూ హల్‌చల్ చేశారు. దాదాపు 50 మందికి పైగా ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ డ్రస్‌లో ఉన్న విద్యార్థులు, టీడీపీ కార్యకర్తలు రెడ్డి హాస్టల్ వద్ద గుమికూడటంతో లోపల హాస్టల్‌లో ఉన్న కొద్ది మంది విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కాసేపు నినాదాలు చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరంతా ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జన్మదినం కావడంతో వెంగముక్కలపాలెం నుంచి ఒంగోలులోని దామచర్ల సత్య కార్యాలయానికి ర్యాలీగా వెళుతూ మార్గం మధ్యలో ఇలా ఇష్టారీతిన ప్రవర్తించారు. ఈ ర్యాలీకి ముందస్తు పోలీసు అనుమతి కూడా లేదని సమాచారం. ర్యాలీలో ఒక్క పోలీసు కూడా లేకపోవడంతో మద్యం తాగిన టీడీపీ కార్యకర్తలు, విద్యార్థులు నడిరోడ్డుపై చిందులేశారు. రెడ్డి హాస్టల్‌లో ఉండే విద్యార్థులు కళాశాలలకు వెళ్లడంతో పెద్ద గొడవ తప్పింది. కళాశాల వదిలిన తర్వాత అయితే హాస్టల్‌లో కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండేవారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చి ఉంటే పెద్ద ఘర్షణ జరిగి ఉండేది. టీడీపీ కార్యకర్తలు ఇలాంటి కవ్వింపు చర్యలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. రెడ్డి హాస్టల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పసుపు కండువాలు వేయడం, కాలితో తన్నడం, విగ్రహంపై కూర్చోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రెడ్డి హాస్టల్ కార్యవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువా..
Comments
Please login to add a commentAdd a comment