రైతుల రోదన
మూగ వేదన..
మార్కాపురం: గ్రామాల్లో గ్రాసం కొరడ ఏర్పడింది. గడ్డి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలకు పైనే పలుకుతోంది. దీంతో పాడి రైతులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఎండుగడ్డి దొరికే పరిస్థితి లేకపోవడంతో పాడి పశువులను ఎలా బతికించుకోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాభావంతో గ్రాసం కొరత..
మార్చి ప్రారంభంలోనే ఎండ తీవ్రతతో అందరూ తల్లడిల్లిపోతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో పశ్చిమ ప్రకాశంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశువులు గడ్డికొరతతో పాటు తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. పశ్చిమ ప్రకాశంలో గ్రాసం కొరత కొనసాగుతుండటంతో గ్రామాల్లో పాలదిగుబడి తగ్గిపోతోంది. పశ్చిమ ప్రకాశంలోని సుమారు 100 గ్రామాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో రైతులు పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు వెళ్లి ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రాసం కొరత మూలంగా 4 లీటర్లు ఇచ్చే పాడిగేదె 2 లీటర్లే ఇవ్వడంతో పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. మార్కాపురం మండలంలోని గజ్జలకొండ, మిట్టమీదపల్లె, కొండేపల్లి, భూపతిపల్లె, బిరుదులనర్వ, నికరంపల్లి, వేములకోట, రాచర్ల మండలంలోని ఆకవీడు, ఆరవీటి కోట, యర్రగొండపాలెం మండలంలోని గంగుపల్లి, పుల్లలచెరువు మండలంలోని గంగవరం, ముటుకుల, మర్రివేముల, శతకోడు, తదితర గ్రామాల్లో గ్రాసం కొరత ఉన్నట్లు తెలిసింది. అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లె, పెద్ద కందుకూరు, కాకర్ల, కొమరోలు మండలంలోని ముక్తాపురం, రాజుపాలెం, కొమరోలు, కురిచేడు మండలంలోని గొల్లపాలెం, తర్లుపాడు మండలంలోని కేతగుడిపి, లక్ష్మక్కపల్లె, రాగసముద్రం, ఉమ్మారెడ్డిపల్లె, తాడివారిపల్లె, తదితర గ్రామాల్లో గ్రాసం కొరత ఉంది. డివిజన్‌లో ఆవులు, ఎద్దులు సుమారు 36 వేలు, గేదెలు 3,76,520 పాలిచ్చే గేదెలు సుమారు 1,19,200 ఉన్నాయి. ఒక గేదెకు రోజుకు 5కిలోల మేత అవసరం. 5కిలోల కంటే ఎక్కువగా తింటేనే పశువులు పాలు ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాడిగేదెలను బతికించుకునేందుకే పోషకులు నానా కష్టాలు పడుతున్నారు. దాణా కూడా కిలో రూ.15 నుంచి రూ.25కు పెరిగింది. ట్రాక్టర్ గడ్డి రూ.15వేల చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా దొరకటం లేదు. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు 5 లీటర్లు పాలు ఇచ్చే గేదె ప్రస్తుతం 3 లీటర్లు మాత్రమే ఇస్తుంది. ఎండుగడ్డి కూడా ఆశించినంతగా లేకపోవటంతో గేదెలకు పొదుపుగా వేస్తున్నారు. మార్కాపురం డివిజన్‌లో సుమారు 10 ప్రైవేట్ పాలడైరీలు పాలసేకరణ చేస్తున్నాయి.
పశ్చిమ ప్రకాశంలో 100 గ్రామాల్లో గ్రాసం కొరత ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలు పైమాటే తగ్గుతున్న పాలదిగుబడి తల్లడిల్లుతున్న పాడి రైతులు
750 ఎకరాల్లో గడ్డి సాగు
పశ్చిమ ప్రకాశంలో గడ్డికొరతను అదిగమించేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా 750 ఎకరాల్లో గడ్డిసాగు చేపడుతున్నాం. ఎవరైనా పశుపోషకులు, రైతులు గడ్డిసాగును చేపడితే వారికి అనుమతి ఇస్తాం. గ్రామాల్లో సాగుచేసిన గడ్డిని తమకు వాడుకుని, మిగిలిన గడ్డిని అమ్ముకోవచ్చు. గడ్డి కొరత రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాం.
– రాఘవయ్య, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్, మార్కాపురం
రూ.15 వేలు పెట్టి ట్రాక్టర్ కొన్నా..
వేసవికావడంతో గడ్డికొరత ఎర్పడింది. ఇటీవలే ట్రాక్టర్ గడ్డిని పల్నాడు ప్రాంతం నుంచి రూ.15వేల ప్రకారం కొనుగోలు చేసి తెచ్చాను. పొలాల్లో పచ్చిగడ్డి లేకపోవడంతో ఎండుగడ్డిమీదే ఆధారపడాల్సి వస్తుంది.
– సీహెచ్ చెంచిరెడ్డి, పిచ్చిగుంటపల్లి
రైతుల రోదన
రైతుల రోదన
రైతుల రోదన
Comments
Please login to add a commentAdd a comment