ఇంటర్ పరీక్షకు 1562 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు మూడో రోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూడో రోజు 23,827 మందికి గాను 22,265 మంది విద్యార్థులు హాజరు కాగా 1562 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 21,617 మంది విద్యార్థులు గాను 30,378 మంది హాజరవగా, 1239 మంది గైర్హాజరు అయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2210 మందికి గాను 1887 మంది హాజరవగా 323 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 67 సెంటర్లలో పరీక్షలు సాగాయి. ఆర్‌ఐఓలు ఆరుగురు, 8 మంది డీఈసీ, డీఐ ఈఓలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 35 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● వీధి దీపాల ఏర్పాటుకు స్తంభం ఎక్కిన సమయంలో ప్రమాదం
బేస్తవారిపేట: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎంపీ చెరువులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని జేబీకేపురానికి చెందిన మీనిగ వెంకట రమణ(24) ఐటీఐ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుందామని తన సమీప బంధువైన జూనియర్ లైన్‌మెన్‌తో కలిసి రోజువారీ పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎంపీ చెరువు గ్రామంలో నాలుగు వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి వీధి దీపాలు ఏర్పాటు చేశాడు. పాఠశాల ఉన్న వీధిలో కొత్తపేట ఎస్సీకాలనీకి 11 కేవీ సింగల్‌ఫేజ్ విద్యుత్‌లైన్ గతంలో ఏర్పాటు చేసి ఉన్నారు. జూనియర్ లైన్‌మన్ వేరేచోట వీధి దీపాల పనులు చేస్తున్నాడు. ఈ విషయం తెలియని వెంకట రమణ 11 కేవీ విద్యుత్ లైన్ ఉన్న వీధిలోని విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ప్రమాదంలో తలపగిలి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుడి తండ్రి క్రిష్ణ మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లి పోయాడు. తల్లి ఆదిలక్ష్మమ్మ వెంకట రమణనను కష్టపడి చదివించింది. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణంతో బోరున విలపించింది.
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని పార్టీ మండల అధ్యక్షులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్శి నగర పంచాయతీ అధ్యక్షునిగా ముతినేడి సాంబశివరావు, దర్శి మండల అధ్యక్షునిగా వెన్నపూస వెంకటరెడ్డి, ముండ్లమూరు మండల అధ్యక్షునిగా చింతా శ్రీనివాసరెడ్డి, దొనకొండ మండల అధ్యక్షునిగా కాకర్ల క్రిష్ణారెడ్డి, తాళ్లూరు మండల అధ్యక్షునిగా తూము వెంకట సుబ్బారెడ్డి, కురిచేడు మండల అధ్యక్షునిగా ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్యలను నియమించారు. అలాగే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండపాలెం మండల అధ్యక్షునిగా ఏకుల ముసలారెడ్డి, దోర్నాల మండల అధ్యక్షునిగా గంటా రమణారెడ్డిలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment