నిద్ర చేసి వస్తూ...!
● రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ మృతి
● భార్య నిండు గర్భిణి
మర్రిపూడి: ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ప్రైవేట్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రేగలగడ్డ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పొన్నలూరు మండలంలో ముప్పాళ్ల గ్రామానికి చెందిన పత్తిపాటి సుబ్బారావు, సింగమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరుకుమార్తెలు. చిన్న కుమారుడైన పత్తిపాటి అశోక్(32) కందుకూరు యాక్సిస్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ తండ్రి సుబ్బారావు 9 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో నిద్ర చేసేందుకు దర్శిలో ఉన్న సోదరి వద్దకు బుధవారం రాత్రి వెళ్లాడు. గురువారం ఉదయం తన సొంత గ్రామమైన ముప్పాళ్లకు అశోక్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో మండంలోని రేగలగడ్డ సమీపంలోకి రాగానే పొదిలి–టంగుటూరు రహదారిపై ఉన్న గుంటల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ప్రమాదంలో అశోక్ తలకు తీవ్ర గాయాలుకావడంతో గ్రామస్తులు 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకుతరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని అక్క స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు అశోక్ భార్య హైమావతి నిండు గర్భిణి. డెలవరీ కోసం హైదరాబాద్ వెద్యశాలకు వెళ్లిట్లు బంధువులు తెలిపారు. తండ్రి చనిపోవడంతో అక్క ఇంటి వద్ద నిద్ర చేసేందుకు వెళ్లి కానరాని లోకానికి వెళ్లిపోవడం, నిండు గర్భిణీ అయిన తన కూతురు ఏమైపోవాలి అని విలపించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment