వైఎస్సార్ విగ్రహంపై దాడి జుగుప్సాకరం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: జనహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై దాడి చేయడం జుగుప్సాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లోని వైఎస్సార్ విగ్రహంపై బుధవారం కొందరు యువకులు దాడి చేయడంపై గురువారం ఆయన స్పందించారు. కొందరు విద్యార్థులు విపరీత ధోరణితో వైఎస్సార్ విగ్రహంపై దాడి చేయడమంటే కులాల మధ్య చిచ్చుపెట్టే అవకాశం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులు అన్ని కులాలకు సంబంఽధించిన వారు ఉంటారన్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్సార్ చేసిన మేలును మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పి సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారన్నారు. వృత్తి పరంగా వైద్యుడైన వైఎస్సార్.. ప్రజా జీవితంలోకి వచ్చి సర్వజనులకు సేవలందించిన మహనీయునిగా ముద్ర వేసుకున్నారన్నారు. పాదయాత్ర తర్యాత సర్వజనుల నిజజీవితాలను గుర్తించి సంస్కరణలు రూపొందించి నిరుపేదలను సైతం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారన్నారు. అందరి ఉన్నతికి బాటలు వేసిన మహానేతను అవమానించడం సమంజసం కాదంటూ హితవు పలికారు.
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీ మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం రాత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో సమీక్ష నిర్వహించారు. తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సభా వేదిక, తదితర ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ త్రివినాగ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, కాన్వాయ్ మార్గాలను తనిఖీ చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగరాజు, ఎస్‌ఎస్‌జీ డీఎస్పీ పోతురాజు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, సీఐ సుబ్బారావు తదితరులు ఉన్నారు.
నేరాల కట్టడిలో డ్రోన్ కెమెరాల పాత్ర కీలకం
● ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో డ్రోన్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నిఘా అవసరాల కోసం కామేపల్లి గ్రామానికి చెందిన ఏలూరు రాంబాబు జిల్లా పోలీసు శాఖకు అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ కెమెరాను గురువారం బహూకరించారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్‌కు ఈ డ్రోన్ కెమెరా అందజేశారు. ఆ కెమెరాను వెంటనే జరుగుమల్లి పోలీసు స్టేషన్‌కు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతానికి 30 కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలకు డ్రోన్ కెమెరాలు పంపించి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య కూడళ్లలో కూడా డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాకొండ సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్‌ఐ మహేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment