దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరం
● యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఏకేయూ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు
ఒంగోలు సిటీ: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ (ఏకేయూ) వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరిపాలనా భవనం వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను గురువారం వారు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన కాలానికి అనుగుణంగా యువత తమ మేధాసంపత్తితో ప్రతి రంగంలోనూ భారతావనిని ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుకు తీసుకెళ్లాలన్నారు. యువత యూత్ పార్లమెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలన్నారు. నేడు దేశానికి యువత అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాలోని యువత ఈ సదావకాశాన్ని వినియోగించుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగే యూత్ పార్లమెంట్ పోటీల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరిధిలోని యువత పాల్గొనవచ్చని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల యువతీ యువకులు ముందుగా మై భారత్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఒక్క నిమిషం కాలం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’ అనే అంశంపై వీడియో తీసి మార్చి 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు అప్లోడ్ చేయాలని ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్షప్రీతం దేవ్‌కుమార్ యువతీ యువకులకు సూచించారు. యూత్ పార్లమెంట్ పోటీల్లో ఆంధ్రకేసరి యూనివర్శిటీ విద్యార్థులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువతీ యువకులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ కమల్ షా, సహాయ ఆచార్యులు డాక్టర్ ఉబ్బా ఈతముక్కల, జాస్మిన్, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు, ఏకేయూ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment