సహనంలో అవని
కొండపి: కట్టుకున్న భర్త కిడ్నీ జబ్బుతో కాలం చేయడంతో కలత చెందిన ఆమెకు కళ్ల ముందే భవిష్యత్ కనిపించింది. ఇద్దరు పసివాళ్లను ప్రయోజకులను చేయడం కోసం కూలీనాలీ చేసింది. సంపాదన సరిపోకపోవడంతో ఆటో డ్రైవర్ అవతారమెత్తింది. ‘ఆడదానివి నువ్వు ఆటో నడుపుతావా..’ కొందరు హేళన చేసినా కుటుంబ పోషణ నిమిత్తం సడలని సంకల్పంతో అనుకున్నది సాధించింది. చకా చకా గేర్లు మారుస్తూ కొండపి మండలంలో రోడ్లపై ఆటోను రయ్రిమనిపించింది. ఆటో నడపడానికి వచ్చిన కొత్తలో హేళన చేసిన వారితోనే ‘ఆటో రెడ్డమ్మ’ అని పిలిపించుకుంది.
జరుగుమల్లి మండలం పీరాపురం గ్రామానికి చెందిన బండి సుజాత ప్రస్తుతం కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నివసిస్తున్నారు. 13 సంవత్సరాల క్రితం భర్త బండి మాల కొండయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తండ్రి చనిపోయేనాటికి పెద్ద కుమారుడు వీర వెంకటేష్ మూడేళ్లు, చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డికి రెండేళ్ల వయసు. ఊహ తెలిసే సమయానికి తండ్రిని కోల్పోయిన పిల్లలకు సుజాత అన్నీ తానైంది. తండ్రి లేని లోటు పిల్లలకు తెలియకుండా చిన్నచిన్న పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కూలీ పనులతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు సరిపోకపోవడంతో ఆటో నడపాలని నిర్ణయించుకుంది. ఆటో కొనేందుకు ఆర్థిక పరిస్థితి సరిపోకపోవడంతో అప్పు చేసింది. గత ఐదేళ్లుగా కొండపి నుంచి జాళ్లపాలెం వరకు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. జాళ్లపాలెం మార్గంలో ఆటోల సంఖ్య క్రమంగా పెరగడంతో రోజుకు రెండు ట్రిప్పులు తిరగడం కూడా కష్టంగా మారింది. ఓ పక్క అనారోగ్య సమస్యలు బాధిస్తున్నా పిల్లల ఉన్నతికి, కుటుంబం గడవడం కోసం మొక్కవోని ధైర్యంతో ఆటో నడుపుతోంది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిపివేసింది.‘ఆటో నడపడం ప్రారంభించిన కొత్తలో ‘ఆడ మనిషి ఏ విధంగా ఆటో నడుపుతుంది’ అని కొందరు ప్రయాణికులు ఎక్కేందుకు నిరాకరించారు. ఆ సమయంలో కుటుంబ పోషణ మరింత కష్టమైపోయింది. కొన్నాళ్ల తర్వాత ప్రయాణికుల్లో నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అందరూ ఆటో ఎక్కుతున్నారు’ అని పాత రోజులను గుర్తు చేసుకుంది రెడ్డెమ్మ. ఈమె పెద్ద కుమారుడు కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు పెద్ద కండ్లగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. పిల్లలు బాగుండాలన్న తాపత్రయంతోనే తాను ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాల్సి వచ్చిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనం కోల్పోకుండా బతుకు బండిని నెట్టుకొస్తున్నానని చెబుతోంది ఈ ఆటో రెడ్డెమ్మ.
భర్త మరణానంతరం
బతుకు బండిని నడిపిస్తున్న సుజాత
అవమానాలు ఎదురైనా సడలని
సంకల్పంతో ఆటోడ్రైవర్‌గా..
సహనంలో అవని
Comments
Please login to add a commentAdd a comment