సైబర్‌ మాయలో వైన్‌షాపు యజమాని | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మాయలో వైన్‌షాపు యజమాని

Published Sat, Mar 8 2025 1:29 AM | Last Updated on Sat, Mar 8 2025 1:29 AM

-

సింగరాయకొండ: ‘హలో గోవిందరావు..నేను ఏఎస్సై ప్రభాకర్‌ని..ఎక్కడున్నావు’..? ఇవతలి నుంచి గోవిందరావు..్ఙసార్‌ నేను షాపులో ఉన్నాను సార్‌’. అవతలి నుంచి..సరేగానీ..నాకు అర్జంటుగా రూ.95 వేలు ఫోన్‌ పే చెయ్యి..నేను ఆ మొత్తాన్ని కానిస్టేబుల్‌తో పంపిస్తున్నా.. సింగరాయకొండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గల రమ్య వైన్‌ షాపులో పనిచేస్తున్న గోవిందరావుకు 9010699759 సెల్‌ నంబర్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఫోన్‌ వచ్చింది. దీంతో గోవిందరావు మాట్లాడుతూ ఈ విషయం మా సార్‌కు కూడా చెప్పండి సార్‌ అంటూ షాపు పర్యవేక్షణ చేసే ఉప్పాళ్ల రమేష్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. ఆ తర్వాత ఏఎస్సై ప్రభాకర్‌ అని చెప్పుకున్న వ్యక్తి రమేష్‌కు కూడా ఫోన్‌ చేసి ఏం చెప్పాడో ఏమోగానీ.. ఆయన వెంటనే అతనికి రూ.95 వేలు ఫోన్‌ పే చేశాడు. కానిస్టేబుల్‌ డబ్బు తెస్తాడు.. తీసుకో అని గోవిందరావుకు కూడా ఫోన్‌ చేసి చెప్పాడు. తీరా చూస్తే పోలీస్‌స్టేషన్‌లో ప్రభాకర్‌ అనే పేరుతో ఏఎస్సై ఎవరూ లేరని, తాము సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని తెలుసుకుని హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన మోసాన్ని పోలీసులకు తెలిపారు. వారి సూచన మేరకు వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసుల పేరుతో వైన్‌ షాపు యజమానిని నమ్మకంగా మోసం చేసిన ఈ విషయం గురించి తెలుసుకుని మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఒంగోలు టౌన్‌: రైలుకింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారెడ్డి పాలెం, టంగుటూరు రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని ఒక వ్యక్తి రఫ్తీ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని, కుడి చేతి మీద అమ్మ అని, ఎడమ ఛాతీ మీద ఈశ్వరి అని పచ్చబొట్టు ఉంది. జీఆర్పీ ఎస్సై అరుణ కుమారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు తిరుపతి, టంగుటూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తి గా పోలీసులు భావిస్తున్నారు.

చిరుత మృతి కేసులో

ఇద్దరు ఫారెస్ట్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

యర్రగొండపాలెం: చిరుత పులి మృతిచెందిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ మార్కాపురం టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.సందీప్‌కృపాకర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 16వ తేదీ యర్రగొండపాలెం రేంజ్‌ పరిధిలోని కొలుకుల బీట్‌లో అటవీ జంతువుల కోసం వేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుంది. అటవీ శాఖాధికారులు సకాలంలో స్పందించకపోవడం వలన అది మృతి చెందింది. దీనిపై నమోదైన కేసులో ఇటీవల నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అటవీ ప్రాంతంలో సంచరించే వేటగాళ్లను గుర్తించలేకపోవడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఉచ్చులో చిరుత చిక్కుకుని మరణించినట్లు గుర్తించిన ఫారెస్ట్‌ శాఖ ఉన్నతాధికారులు కొలుకుల సెక్షన్‌ ఆఫీసర్‌ బి.సక్రూనాయక్‌, బీట్‌ ఆఫీసర్‌ టి.నాగేశ్వరరావును సస్పెండ్‌ చేశారు.

రూ.95 వేలు పోగొట్టుకుని 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement