విద్యలో వాణి
సంతనూతలపాడు: దృఢ సంకల్పం ఉంటే.. కొండంత లక్ష్యమైనా ఛేదించడం సులువే! వైఫల్యాలు వెక్కిరించినా, విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు ఈ అక్కాచెల్లెళ్లు. లక్షల మందితో పోటీపడి పోటీ పరీక్షల్లో నెగ్గి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తల్లి ప్రోత్సాహంతో విజయం దిశగా వడివడిగా అడుగులు వేసిన వీరి ప్రస్థానం యువతకు ఆదర్శనీయం. మహిళా దినోత్సవం సందర్భంగా తమ విజయాన్ని తల్లికి అంకితమిచ్చారు. సంతనూతలపాడుకు చెందిన గోనేపల్లి కోటేశ్వరరావు, సుజాత దంపతుల కుమార్తెలు అనుపమ, లక్ష్మీప్రియ. ఇద్దరూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సంతనూతలపాడులో గోదాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కాన్వెంట్లో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించారు. అక్కాచెల్లెళ్లిద్దరూ పదో తరగతి నుంచి ఎంటెక్ వరకు ప్రథమస్థానాల్లో మార్కులు సాధించారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా అవకాశం వచ్చినా వదిలేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనుపమ వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీగా ఒకే పర్యాయంలో ఉద్యోగాలు సాధించింది. చీమకుర్తిలో వీఆర్‌ఓగా భాధ్యతలు నిర్వహించి, అందరి మన్ననలూ పొందింది. ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షల్లో నెగ్గి కేంద్ర హోంశాఖలో ఉన్నత ఉద్యోగం సాధించింది. నంద్యాలలోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన లక్షీప్రియ తన సోదరికి ఉద్యోగం వచ్చిన మరుసటి నెలలోనే ఆంధ్రా బ్యాంక్ పీఓగా ఎంపికై ంది. నెల వ్యవధిలోనే కుమార్తెలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాదించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
అమ్మే నా మొదటి గురువు
చిన్ననాటి నుంచి అమ్మ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. నాన్న ఫొటోగ్రఫీతో బిజీగా ఉండేవారు. క్రమం తప్పకుండా అమ్మ మా ఆలనాపాలనా చూస్తూ క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించింది. అమ్మ ప్రోత్సాహం, నాన్న కృషి వల్లే పట్టుదలతో చదివి హోంశాఖలో ఉన్నత ఉద్యోగం సాధించగలిగా. – అనుపమ
ఈ విజయం అమ్మదే..
చిన్నప్పటి నుంచి అమ్మే దగ్గరుండి చదివించేది. క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాళ్లం. మంచి మార్కులు సాధించేవాళ్లం. అక్క అనుపమ హోంశాఖలో ఉద్యోగం సాధించడం నాలో పట్టుదలను మరింత పెంచింది. బ్యాంక్ ఉద్యోగం సాధించడానికి విపరీతమైన పోటీ ఉన్నా కష్టపడి చదివి ఆంధ్ర బ్యాంక్ పీఓగా ఎంపికయ్యా. ఈ విజయం అమ్మకే అంకితం. – లక్ష్మీప్రియ
Comments
Please login to add a commentAdd a comment