నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో మార్కాపురం రానున్నారు. గం.10.55 వరకూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. గం.11.15 వరకు అధికారులతో సమావేశమై సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించి రుణాల పంపిణీ, మహిళలతో ముఖాముఖితోపాటు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, సభా వేదిక ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్‌పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ దామోదర్ మాట్లాడుతూ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ద్వారా సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని, సీఎం కాన్వాయ్ రూటును పరిశీలించారు. ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈయన వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌జీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌జీ డీఎస్పీ పోతురాజు, డీఎస్పీలు నాగరాజు, శ్రీనివాసరావు, సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు రాఘవేంద్ర, సుబ్బారావు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 818 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు మూడో రోజు మాథ్స్ 2ఏ, బోటనీ 2, సివిక్స్ 2 పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 19,614 మందికి గాను 18796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 818 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 17666 మంది విద్యార్థులు గాను 17013 మంది హాజరవగా, 653 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 1948 మందికి గాను 1783 మంది హాజరవగా, 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్‌ఐఓలు ఏడుగురు, 17 మంది డీఈసీ– డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 32 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ చేసిన ఒకరిని బుక్ చేశారు.
నేడు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు
కొమరోలు: మండలంలోని ఇడమకల్లు గ్రామంలో కళ్యాణరామ, పట్టాభిరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణ ధ్వజ, శిఖర, కలశ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. బండలాగుడు పోటీల్లో 7 నగదు బహుమతులు వరుసగా రూ.1 లక్ష, రూ.80 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందజేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు పోటీలు నిర్వహిస్తారని, ఆసక్తి గల వారు 9573319779 సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment