కులం పేరుతో దూషిస్తూ అత్తింటివారి వేధింపులు
ఒంగోలు టౌన్: కులాంతర వివాహం చేసుకున్న ఒక దళిత మహిళను అత్తింటి వారు కులం పేరుతో దూషించడమే కాకుండా ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన ఎస్సీ మహిళ సురేఖ బ్రాహ్మణ కులానికి చెందిన చంద్రశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. అనారోగ్యంతో చంద్రశేఖర్ 2023లో మరణించారు. అనంతరం ఆస్తి పంపకాల విషయమై అడిగితే అత్తింటివారు కులం పేరుతో దూషిస్తూ ఆస్తిలేదు.. పాస్తిలేదని తెగేసి చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నెల 26వ తేదీ సురేఖ చిన్న కూతురికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స చేయించేందుకు వైద్యశాల ఖర్చులు అడగటానికి అత్తవారింటికి వెళ్లగా, బయటకు నెట్టి వేసి కులం పేరుతో దూషించారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గత ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
రాచర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం మధ్య రైల్వే ట్రాక్‌పై సోమవారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు.. కంభం పట్టణానికి చెందిన కొప్పుల రమేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తన సన్నిహితులకు తెలియజేశాడు. రమేష్ ఆత్మాహత్య చేసుకోబోతున్నాడని కంభం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. రాచర్ల పరిధిలో లొకేషన్ చూపించడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని యువకుడిని రక్షించారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
పట్టపగలే ఆటో చోరీ
రాచర్ల: జనం సంచారం మెండుగా ఉన్న సమయంలో ఆటో చోరీకి గురైంది. ఈ సంఘటన మండల కేంద్రమైన రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కంభం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ శివశేఖర్ కుమార్తె రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. సోమవారం కుమార్తెను చూసేందుకు వచ్చిన శివశేఖర్ తన ఆటోను స్కూల్ బయట ఉంచి లోపలికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోను అపహరించారు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆటో కనపడకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచర్ల, అనుములపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఎస్సై పి.కోటేశ్వరరావు పరిశీలించారు. ఆటోను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
ప్రాణాలు కాపాడిన పోలీసులు
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి పట్టివేత
కులం పేరుతో దూషిస్తూ అత్తింటివారి వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment