సబ్సిడీ పనిముట్ల పేరుతో రైతులకు మోసం
ఒంగోలు టౌన్: సబ్సిడీ పనిముట్లు ఇప్పిస్తానంటూ దర్శికి చెందిన ఒక మోసగాడు రైతులను నిండా ముంచాడు. దర్శి ప్రాంతానికి చెందిన పలువురు రైతులకు మాయమాటలు చెప్పి 16.82 లక్షల రూపాయలు వసూలు చేశాడు. రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనిముట్లు ఇప్పించకపోవడంతో రైతులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ అతడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడంతో మోసపోయినట్లు గమనించిన రైతులు సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసు అధికారులు చట్టపరంగా విచారించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరో ఘటనకు సంబంధించి.. ఒంగోలుకు చెందిన ఒక యువకుడికి కరెంటు ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన వ్యక్తి మోసానికి పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదు చేశారు. కరెంటు ఆఫీసులో ఉద్యోగం పేరుతో 6 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 77 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment