వలసబాట | - | Sakshi
Sakshi News home page

వలసబాట

Published Wed, Mar 12 2025 7:32 AM | Last Updated on Wed, Mar 12 2025 7:27 AM

వలసబాట

వలసబాట

డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు: 47,423
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.218 కోట్లు
యువత

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టౌన్‌:

జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర చదువులు చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 47,423 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదు. దాంతో గత ఏడాదికి సంబంధించి రూ.110 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంటుతో మాకు సంబంధం లేదంటూ ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేశారు. దాంతో వేలాది మంది విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమందైతే చదువులు మానేసి పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇక రెండో ఏడాదైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తారేమో అని ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ రెండో ఏడాది కూడా చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పి మొండిచేయి చూపింది. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి. నగరంలోని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదని ఒక విద్యార్థిని కాలేజీ బయట నిలబెట్టారు. బైపాస్‌ లో ఉన్న మరో డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తాం, లేకుంటే లేదని బెదిరింపులకు దిగింది. హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను నానా తిప్పలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 సంవత్సరానికి ఒక త్రైమాసికంలో మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించారు. మిగతా మూడు త్రైమాసికాలకు ఫీజులు చెల్లించలేదు. అలాగే 2024–25 విద్యాసంవత్సరానికి గాను మూడో సెమిస్టర్‌ గడుస్తున్నా నేటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదు. ఇప్పటి వరకూ జిల్లాకు సంబంధించి రూ.218 కోట్లు పెండింగులో ఉన్నాయి. రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారో లేదో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

నిరుద్యోగ భృతికి ఎగనామం:

లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. జిల్లాలో సుమారు 7.86 లక్షల యువకులు, 7.65 లక్షల మంది యువతులు ఉన్నారు. వీరిలో సుమారు 11 లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఉద్యోగాలు వచ్చే వరకు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ.330 కోట్ల మేర నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,960 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. అటు ఉద్యోగాలు ఇవ్వకుండా, చేయడానికి ఎలాంటి పనులు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్సీ, పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎదురుచూపు:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఫైలు మీద తొలి సంతకం చేస్తామని చంద్రబాబు చెప్పిన మాట కూడా నీటి మూటలా మిగిలి పోయింది. జిల్లాలో బీఈడీ చేసిన సుమారు 8 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కానిస్టేబుల్‌ పరీక్షలు రాసిన వారు 5 వేల మంది ఉన్నారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్కాపురం, ఒంగోలు మెడికల్‌ కాలేజీలు, జీజీహెచ్‌ ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు సంబంధించి 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ రావడంతో అప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్‌ రద్దు చేసింది. ఆ ఉద్యోగాల కోసం అప్పట్లో 15 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి వద్ద నుంచి వసూలు చేసిన దరఖాస్తు ఫీజును వెనక్కి తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్‌స్రా్‌ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా సుమారు ఆరు వేల మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించింది. వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 12 వేల మందికి ఉపాధి కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీరు శాఖకు మంత్రిని నియమించింది కానీ ఆ వ్యవస్థకు మంగళం పాడడం గమనార్హం.

ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకున్నవారు: 23,448 మంది

ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు: 52,000 మంది

11 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి నెలకు: రూ.330 కోట్లు

సంవత్సరానికి: రూ.3,960 కోట్లు

బీఈడీ అభ్యర్థులు: 8000 మంది

కానిస్టేబుల్‌ పరీక్షరాసిన వారు: 5000 మంది

ఉద్యోగం రాక కూలి పనులకు వెళ్తున్నాను

నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు రాక పొలం పనులకు వెళ్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనబడటం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలి.

– సుధా, అర్థవీడు మండలం

జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లు గడవడం కష్టమైపోవడంతో ఏ పని దొరికితే ఆ పనికి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి పనులు కూడా లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలుగా పనులకు వెళుతున్నారు. అక్కడ కూడా రాజకీయాలు ప్రవేశించడంతో చేసేదేమీ లేక భవన నిర్మాణ కార్మికులుగా బెంగళూరు, హైదరాబాద్‌, చైన్నె నగరాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ పనులకు వెళుతున్న వారి సంఖ్య ఇలా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా, నాన్‌ టీచింగ్‌ పనులు చేస్తున్నవారు 7 వేలు, ప్రైవేటు కాలేజీలలో పనులు చేస్తున్న వారు 5 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాంపౌండర్లుగా, నర్సులుగా పనులు చేస్తున్న వారు 10 వేలమంది, జుమాటో, స్విగ్గిలలో 3 వేల మంది, ఆటో డ్రైవర్లుగా 8 వేల మంది, పెట్రోలు బంకుల్లో బాయ్స్‌గా , అకౌంటెంట్లుగా 1500 మంది, షాపింగ్‌ మాల్స్‌లో సేల్స్‌ మెన్‌లు, సేల్స్‌ ఉమెన్లుగా 7 వేల మంది, చిన్న షాపింగ్‌ మాల్స్‌లో 5 వేల మంది, మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ 500 మంది, కేటరింగ్‌ 3 వేల మంది, టెలీ కాలర్స్‌ 2 వేల మంది అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. సుమారు 52 వేల మంది వచ్చే అరకొర వేతనాలతో బతుకుబండిని నెట్టుకొస్తున్నారు.

దివ్యాంగులకు సైతం మొండిచేయి...

జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు చదువుకొని ఉద్యోగం కోసం వస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరిలో కంటి చూపు లేని వారు 626 మంది, చెవిటి మూగ వారు 640 మంది, కాళ్లు చేతులు లేని వికలాంగులు 4,172 మంది ఉన్నారు. మొత్తం 5438 మంది దివ్యాంగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరే కాకుండా 6,348 మంది మహిళలు, 7,184 మంది ఎస్సీలు, 1,511 మంది ఎస్టీలు, 6,620 మంది బీసీలు ఉన్నారు. నేటికి 23,448 మంది ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement