తొలగించిన భూముల పునఃపరిశీలన చేపట్టాలి
● సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి
ఒంగోలు సిటీ: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. అమరావతి నుంచి సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తల్లి బిడ్డలకు మేలు చేసే కంగారు కేర్ సెంటర్లు
ఒంగోలు టౌన్: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి కంగారు మదర్ కేర్ సెంటర్లు ఎంతో మేలు చేస్తాయని కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్ చీఫ్ ఆఫీసర్ ట్రాయ్ చున్నిగం అన్నారు. మంగళవారం ఆయన సీఈబీ టీం సభ్యులతో కలిసి జీజీహెచ్‌లోని గైనికాలజీ, పీడియాట్రిక్, ఎస్‌ఎన్‌సీయూ, ప్రతిపాదిత కంగారు మదర్ కేర్ సెంటర్లను పరిశీలించారు. తొలుత సీఈబీ టీం సభ్యులు రీసెర్చ్ డైరక్టర్ వివేక్ సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రావ్యలు సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వివిధ విభాగాలకు చెందిన వైద్యులతో చర్చించారు. సీఈబీ పూర్తి స్థాయిలో సాంకేతిక సాయాన్ని అందజేస్తుందని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్‌లో అన్నీ రకాల సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ జమున టీం సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కిరణ్, డీసీహెచ్‌ఎస్ డా.సూరిబాబు, మదర్ కేర్ నోడల్ అధికారి డా.వేణుగోపాల్ రెడ్డి, హెచ్‌ఓడీలు సంధ్యారాణి, శివరామకృష్ణ, డా.తిరుమలరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శనగలు, మినుములు కొనుగోలుకు అనుమతులు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు సిటీ: శనగలు, మినుముల పంట ఉత్పత్తులను నాఫెడ్ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుంచి శనగలు కనీస మద్దతు ధర రూ.5650, మినుములు కనీస మద్దతు ధర రూ.7400 లకు కొనుగోలు చేసేందుకు అనుమతులు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 23,023 మంది రైతులు 24,600 హెక్టార్లలో శనగల పంట సాగు చేసుకున్నట్లు ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 60,826 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేశారు. మినుములు 11,200 హెక్టార్లలో 12,540 మంది రైతులు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 14,489 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. రబీ 2024–25 లో శనగ, మినుముల పంటను ఈ క్రాప్‌లో నమోదు చేయించుకున్న రైతుల వద్దనుంచి పంట కొనుగోలు చేస్తారన్నారు. రైతులు ఈనెల 13వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంట వివరాలు, పంట నూర్పిడి తేదీని నమోదు చేయించుకోవాలని చెప్పారు. రైతు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ద్వారా అమ్ముకోవాలని సూచించారు. తమ సరుకును అమ్ముకొనే తేదీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుందని, రైతులకు తమ డబ్బులు ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారన్నారు. రైతులు తమ సరుకును అమ్మే సమయంలో తమ మొబైల్ నంబరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ కు లింక్ అందో లేదో సరి చూసుకోవాలని తెలిపారు. రైతులు తమ పంటను శుభ్రపరుచుకొని, ఆరబెట్టుకొని శనగలు తేమ శాతం 14 శాతంలోపు, మినుములు తేమ 12 శాతం లోపు ఉండి ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాల్లో ఉండేలా చూసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment