
పులకించిన పృధులాద్రి
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్దిచెందిన పృధులగిరి లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి గరుడసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో పృధులాద్రి కిటకిటలాడింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆగమజ్ఙ్నులు నారాయణం ఆదిశేషాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం ఆదిశేషాచార్యులు, వెంకటసాయి స్వామివారిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. గరుడసేవ సందర్భంగా స్వామివారిని పల్లకిపై ఉంచి బోయిలు మెట్లమార్గాన తీసుకెళ్లి అన్ని సత్రాల సమీపంలోని భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తూ ఊరేగించారు. గరుడోత్సవానికి అలవల వెంకయ్య, సుందరరావు, వలేటి నర్శింహారావు ఉభయదాతలుగా వ్యవహరించారు. స్థానికులతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వామివారికి నైవేథ్యంగా సమర్పించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో వేచి ఉండి స్వామివారి మూటవిరాట్‌ను భక్తులు దర్శించుకున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
భక్తుల కోసం దేవదాయశాఖ ఈఓ నర్రా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన సత్రాలలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి కోనేటి స్నానాలు ఆచరించారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్వామివారి సన్నిధిలో ఊయల కట్టడం ఆనవాయితీ కావడంతో పలువురు అనుసరించారు. మరికొందరు మెట్లదారిన నడిచిరాగా, సీతమ్మవారి పాదాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మెట్లను పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్, కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మర్రిపూడి, కొండపి, కనిగిరి మండలాల ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో స్వామివారికి గరుడోత్సవం పోటెత్తిన భక్తులు

పులకించిన పృధులాద్రి

పులకించిన పృధులాద్రి
Comments
Please login to add a commentAdd a comment