
భూ అక్రమాల కేసుల విచారణ వేగవంతం చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేసులకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సత్వరమే విచారణాధికారులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ ఏ బాలంజనేయులు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, తహసీల్దార్ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
17లోగా ఉన్నతాధికారులు సమాచారం అందించాలి
ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 21, 25 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు శాఖల వారీగా ఉన్నతాధికారులు ఈ నెల 17వ తేదీలోగా సమాచారం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కాన్ఫరెన్స్‌లో పీపీటీ ద్వారా వివిధ అంశాలను, ముఖ్యంగా జిల్లాలోని పరిస్థితులను బట్టి టాప్–5 శాఖలకు సంబంధించిన వివరాలను, ప్రస్తుత సమస్యలు, మూడు నెలల్లోగా వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను వెల్లడించాల్సి ఉందన్నారు. అందుకోసం సమగ్ర సమాచారాన్ని తనకు అందించాలని అధికారులకు సూచించారు. మూడో శనివారం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం కోసం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో సీపీఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment