
అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర తరలింపు
సీఎస్ పురం (పామూరు): సీఎస్ పురం మండలంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. పగలూరాత్రీ తేడాలేకుండా కూలీలను ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా జామాయిల్ కర్ర కొట్టించి పలు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించి అమ్ముకుంటూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. సీఎస్ పురం మండలంలోని కంభంపాడు గ్రామం నుంచి పెదరాజుపాలెం వెళ్లే మార్గంలో నలజనంపాడు రెవెన్యూ పరిధిలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నారు. ప్రస్తుతం సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను గతేడాది డిసెంబర్‌లో కొందరు అక్రమార్కులు కొట్టి తరలించారు. కానీ, స్థానిక అధికారులుగానీ, సీఐడీ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రస్తుతం 202/1, 204/2, 3, 205/2, 3 సర్వే నంబర్లలో జామాయిల్ కర్రను అక్రమంగా నరికి తరలిస్తున్నారు. ఈ భూమిని గతంలో లింగసముద్రం మండలానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసి అగ్రిగోల్డ్ వారికి అమ్మారని, ప్రస్తుతం ఆ భూమిలోనే జామాయిల్ కర్ర కొడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ వారికి అమ్మినప్పటికీ.. ఆ భూములు అమ్మిన వ్యక్తి పేరుతోనే ఆన్‌లైన్‌లో ఉన్నాయని, దానిని అడ్డం పెట్టుకుని ఆ వ్యక్తి జామాయిల్ కర్రను అక్రమంగా కొట్టి తరలిస్తున్నాడని అంటున్నారు. అయితే, దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉండగా, ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని బూచిగా చూపి పలు సర్వే నంబర్లలో కూడా జామాయిల్ కొట్టి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. జామాయిల్ కర్రను ఫైర్ ఉడ్, ఫ్లయ్ ఉడ్, కాగితపు తయారీ, భవన నిర్మాణంలో పోటీ కర్రలకు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మేలు రకం కర్ర టన్ను రూ.7 వేలు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతూ లక్షలు కాజేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
అగ్రిగోల్డ్ భూముల్లో ఎవరైనా జామాయిల్ కర్ర కొట్టి తరలిస్తే ఉపేక్షించం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వీఆర్‌ఓను ఘటన స్థలానికి పంపి వివరాలు సేకరిస్తున్నాం. జామాయిల్ కర్ర కొట్టే సమయంలో సమీపంలోని గ్రామస్తులు సైతం బాధ్యతగా వ్యవహరించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
– డి.మంజునాథరెడ్డి, తహసీల్దార్, సీఎస్ పురం
విచ్చలవిడిగా నరికి లక్షలు దండుకుంటున్న టీడీపీ నాయకులు

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర తరలింపు

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర తరలింపు
Comments
Please login to add a commentAdd a comment