
ఎమ్మెల్యే విజయకుమార్‌కు అవమానం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ సభలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్‌కు అవమానం జరిగింది. విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన మనస్తాపంతో సభలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దాంతో సంతనూతలపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మా ఎమ్మెల్యేను అవమానపరిచారంటూ సభాప్రాంగణంలో నిర్వాహకులతో వాదనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం డాక్టర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌లను నిర్వాహకులు ఆహ్వానించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమంలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ సరిగ్గా 10.30 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అర్ధగంట వేచి ఉన్న తరువాత మంత్రి స్వామి వచ్చారు. అప్పటికే అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. అయినా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. చేసేదేమీ లేక మంత్రి స్వామి, ఎమ్మెల్యే విజయకుమార్ సభా ప్రాంగణంలోనే పడిగాపులు కాశారు. సుమారు గంటకు పైగా ఆలస్యంగా ఎమ్మెల్యే దామచర్ల సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వచ్చీ రాగానే అధికారులు, నిర్వాహకులు హడావుడి చేశారు. ముగ్గురు అతిథుల చేత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి వరకు విగ్రహానికి వేసి ఉన్న కర్టెన్ తొలగిపోవడంతో శిలాఫలకం బయటపడింది. అందులో ప్రొటోకాల్ ప్రకారం సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయయ్‌కుమార్ పేరు లేదు. విగ్రహావిష్కరణకు సంబంధించి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫొటో లేదు. దాంతో ఎమ్మెల్యే బీఎన్ అవమానంగా భావించారు. అనంతరం సభ ప్రారంభమైంది. ఇక్కడ కూడా నిర్వాహకులు ప్రొటోకాల్ పాటించలేదు. మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల, నగర మేయర్ తదితరులను వేదిక మీదకు పిలిచిన తరువాత చివరిగా ఎమ్మెల్యే విజయకుమార్‌ను వేదిక మీదకు పిలిచారు. దాంతో ఆయన మరింత అవమానంగా భావించారు. వేదిక మీదకు ఎక్కకుండా వెళ్లిపోయారు. ఇది గమనించిన సంతనూతలపాడు టీడీపీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే మా ఎమ్మెల్యేను అవమానించారంటూ గొడవకు దిగారు. సభకు హాజరుకాని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీల పేర్లను శిలాఫలం మీద వేసి మా ఎమ్మెల్యే పేరు ఎందుకు వేయలేదని నిలదీశారు. రాత్రికి రాత్రి శిలాఫలకం తొలగించి కొత్త శిలాఫలకం వేయించాలని, అప్పటి వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక దళిత ఎమ్మెల్యేను దళిత ఉద్యోగ సంఘాలే అవమానించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ వాదనకు దిగడంలో కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఈ లోపు నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
దామచర్ల పాత్రపై అనుమానాలు:
అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పేరు ముద్రించకపోవడంతో జిల్లా అధికార పార్టీలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టయింది. ఉప్పుగుండూరు రేషన్ బియ్యం పట్టివేత వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు, బీఎన్ విజయకుమార్‌కు మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచి దామచర్ల వర్గం లోలోపల ఉడికిపోతున్నారని సంతనూతలపాడు దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే విజయకుమార్ పేరు శిలాఫలకం మీద ముద్రించకుండా చేసి ప్రతీకారం తీర్చుకున్నారని చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందని చెప్పడానికి వీలులేకుండా ఫ్లెక్సీల మీద కూడా ఆయన ఫొటోలు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దామచర్ల ఒత్తిడితోనే డీఆర్‌ఓ చినఓబులేశు ఈ కుట్రకు తెరతీశారని విమర్శలు గుప్పిస్తున్నారు.
టీడీపీలో బయటపడిన విభేదాలు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై ఎమ్మెల్యే బీఎన్ పేరు వేయకుండా ప్రొటోకాల్ ఉల్లంఘన బీఎన్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు సభలో పాల్గొనకుండా వెళ్లిపోయిన బీఎన్ విజయకుమార్
Comments
Please login to add a commentAdd a comment