దేవాలయాల్లో రెచ్చిపోయిన దొంగలు
దర్శి (ముండ్లమూరు): దేవాలయాలపై దొంగలు విరుచుకుపడ్డారు. ఏకంగా ఒకేరోజు రెండు గ్రామాల్లోని నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలను సైతం పాడుచేసి పోలీసులకు సవాల్ విసిరారు. ముండ్లమూరు మండలంలో జరిగిన ఈ సంఘటనల వివరాల్లోకెళ్తే.. మండలంలోని జమ్మలమడక గ్రామంలో ఉన్న శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో, బొప్పూడివారిపాలెం గ్రామంలోని భక్తాంజనేయస్వామి, పోలేరమ్మతల్లి ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. జమ్మలమడకలో అమ్మవారి పది తులాల బంగారు మంగళసూత్రం, అర కిలో వెండి ఉత్సవమూర్తి, కిరీటం, తొడుగులు, ఇతర ఇత్తడి వస్తువులు, ఉత్సవమూర్తికి చెందిన రెండు తులాల బంగారు తాళిబొట్టు, రెండు తులాల బంగారు ముక్కుపుడక, శివాలయం హుండీ పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.40 వేల నగదు, ఆంజనేయస్వామి గుడిలో హుండీ పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బొప్పూడివారిపాలెంలో భక్తాంజనేయస్వామి, పోలేరమ్మ తల్లి ఆలయాల్లో రెండు హుండీలు పగులగొట్టి రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. సంవత్సరం క్రితం రెండు కోట్ల రూపాయలతో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని భారీగా నిర్మించినట్లు గ్రామస్తులు, పూజారి కే కృష్ణప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గ్రామంలో కరెంటు ఫీజులు తీసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎక్కడో లైన్ కట్ అయి ఉంటుందనుకుని స్థానికులు లైన్‌మేన్‌కు ఫోన్ చేయడంతో గంట తర్వాత వచ్చి ఫీజులు వేయడంతో కరెంటు వచ్చింది. ఈలోపే ఆలయాల్లో దొంగలు పడి అందినకాడికి దోచికెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ముందుగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి వాటికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు కూడా ఎత్తుకెళ్లారు. గ్రామంలో పోలీసులు పెట్టిన సీసీ కెమెరా కూడా ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. ఆ తర్వాత గుడిలోకి వెళ్లి గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలున్న తాళిబొట్టు, ఉత్సవ విగ్రహాలతో పాటు హుండీ పగులగొట్టి అందులోని నగదు, ఇతర విలువైన సామగ్రి దోచుకెళ్లారు. బొప్పూడివారిపాలెం గ్రామంలోని సరిహద్దుల్లో గల భక్తాంజనేయస్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయాల్లో కూడా తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి హుండీలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. గ్రామంలో పోలీసులు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఘటన స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ముండ్లమూరులోని హోటల్లో రూ.10 వేల విలువైన అట్లపెండం, జేసీబీ తొండెంను దొంగలు ఎత్తుకెళ్లారు. గత బుధవారం రాత్రి గ్రామంలోని సెంటర్‌లో మోటారు సైకిల్ ఎత్తుకెళ్లారు. గతంలోనూ అధిక సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లను కూడా దొంగతనం చేశారు. వరుస దొంగతనాలతో ముండ్లమూరు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఒకేరోజు రెండు గ్రామాల్లోని నాలుగు ఆలయాల్లో చోరీ
రూ.లక్ష నగదు, 14 తులాల బంగారం, అరకిలోకిపైగా వెండి ఆభరణాల
అపహరణ
అర్ధరాత్రి కరెంటు కట్ చేసి
మరీ దొంగతనం
సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి హార్డ్
డిస్క్‌లు తొలగించిన వైనం
దేవాలయాల్లో రెచ్చిపోయిన దొంగలు
దేవాలయాల్లో రెచ్చిపోయిన దొంగలు
Comments
Please login to add a commentAdd a comment