
అక్రమాలకు పాల్పడితే ఎవరినీ క్షమించం
పెద్దదోర్నాల:
తాను సర్వసభ్య సమావేశానికి హాజరైతే ఎక్కడ అతను చేసిన అవినీతి బయటకు వస్తుందోనన్న భయంతోనే మండల సర్వ సభ్య సమావేశాన్ని వాయిదాలు వేస్తున్నారని పెద్దదోర్నాల ఇన్‌చార్జి ఎంపీడీఓ నాసర్‌రెడ్డి తీరుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరగాల్సిన సర్వ సభ్య సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదన్న కారణంతో వాయిదా వేసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఇన్‌చార్జి ఎంపీడీఓపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు సమావేశాలను ఏ అధికారులు పాల్గొనకుండా, శాసన సభ్యుడైన తనకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని విమర్శించారు. ఒక వేళ సమాచారం తెలుసుకొని సమావేశానికి వచ్చేందుకు సిద్ధపడితే మళ్లీ ఆ సమావేశాన్ని రద్దు చేస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు 13వ తేదీ సమావేశం ఉందని సమాచారం ఇచ్చారని, అయితే తాను వస్తున్నానన్న నెపంతో దాన్ని 15 తేదీకి వాయిదా వేశారన్నారు. అయితే 15 తేదీ రాగానే మళ్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చి మండల సమావేశాన్ని ఏఓ నిర్వహించాలని బాధ్యతలు అప్పజెప్పారన్నారు. ఏ అధికారం లేని తెలుగుదేశం ఇన్‌చార్జి చుట్టూ తిరుగుతున్న ఎంపీడీఓ 11 గంటలకు సమావేశం అని ప్రకటించి, అందరూ ఎంపీడీఓ వస్తే సమావేశానికి వెళ్లాలని వేచి చూస్తున్న తరుణంలో మీటింగ్ హాల్ లోకి రాకుండా కోరం లేదంటూ పారిపోయాడని ఎద్దేవా చేశారు. అసలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదన్నారు. అలాంటప్పడు ఇన్‌చార్జి ఎంపీడీఓకు స్వచ్ఛ భారత్‌తో పనేంటని ప్రశ్నించారు. ఒక వేళ స్వచ్చ భారత్‌లో తాను పాల్గొనదల్చినప్పుడు మండల సర్వ సభ్య సమావేశం ఉందని ఎందుకు ప్రకటించారని అన్నారు. ఈఓపీఆర్డీగా ఉన్న ఈ ఇన్‌చార్జి ఎంపీడీఓ రూ.25 లక్షలు ఎలా డ్రా చేయగలుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో లాలూచీ పడి నిధులను వారికి దోచి పెడ్తున్నారన్నారు. ఈ సమావేశానికి వస్తే దోచుకున్న నిధులకు ఎక్కడ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనన్న భయంతోనే సమావేశాలు వాయిదా వేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇటువంటి అధికారుల చర్యలను కలెక్టర్, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్‌లు తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ ఎంపీడీఓ సభను నిర్వహించడు...శాసన సభ్యులంటే గౌరవం లేదు... స్థానిక సమస్యలపై అవగాహన అసలే లేదన్నారు. మండలంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో సిద్దహస్తుడీ ఎంపీడీఓ అని విమర్శించారు. అధికారంలేని వ్యక్తులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించటం ఒక్కటే ఇతనికి తెలిసిన విద్య అన్నారు. ఎండీడీఓ నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జెడ్పీ సీఈఓ, కలెక్టర్‌లపై ఉందన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను అవమానపర్చటం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి పని చేయకపోవటం ఇదేనా వీరి విధానం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎంపీడీఓ నాసర్‌రెడ్డి తీరును విమర్శిస్తూ కార్యాలయం బయట ఎంపీపీ, ఎంపీటీసీ, కోఆప్షన్‌సభ్యులు, పంచాయతీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఎంపీడీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి ఎంపీపీ గుమ్మా పద్మజ యల్లేష్, జడ్సీటీసీ సభ్యురాలు లతా చంద్రకాంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ చేసిన అవినీతిపై ప్రశ్నిస్తామన్న భయం ఉంది ఆ భయంతోనే సమావేశాలకు రాకుండా పారిపోతున్నారు కొందరు నాయకులకు తొత్తులా పని చేస్తున్నారు ఇన్‌చార్జి ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే తాటిపర్తి మండిపాటు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన
వెలిగొండ నిర్వాసితులకు ప్యాకేజీ అందజేయండి
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందచేశారు. గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్న జాబితా ప్రకారం వరుస క్రమంలో పరిహారం ఇవ్వాలని, గెజిట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ మంజూరు చేయాలని, ముంపు గ్రామాల పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు, అర్హత ఉండి సర్వేలో మిస్సింగ్ అయిన కుటుంబాలకు గెజిట్‌లో చేర్చాలని ఆయన కోరారు. 2,996 కుటుంబాలకు గాను 2,148 మందికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ మంజూరయ్యాయని, మిగిలిన 848 కుటుంబాలకు పీడీఎఫ్ పెండింగ్ అవార్డులు పూర్తిచేయాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాధాన్యత వరుస క్రమంలో ఇవ్వాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో కొత్త రోడ్లు మంజూరు చేయాలని మరో వినతి పత్రంలో ఆయన కోరారు. యర్రగొండపాలెం నుంచి దుర్గి వెళ్లేందుకు 10 కిలో మీటర్ల రోడ్డు, యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వెళ్లేందుకు 10.5 కిలోమీటర్ల పొడవున్న రోడ్లను మంజూరు చేయాలన్నారు. యర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ రోడ్డు గత ప్రభుత్వ కాలంలో మంజూరైందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పనులు చేపట్టకుండా కాలయాన చేస్తున్నాడని, పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్‌కు వివరించారు.

అక్రమాలకు పాల్పడితే ఎవరినీ క్షమించం
Comments
Please login to add a commentAdd a comment