
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దు
● జీరో వేస్ట్ మార్కెట్లను ఆవిష్కరించాలి ● స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా ప్రజలందరూ తమ వంతు బాధ్యత వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు జీరో వేస్ట్ మార్కెట్ల ఆవిష్కరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. శ్రీస్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రశ్రీ కార్యక్రమంలో ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛత దివస్ లో భాగంగా ఒంగోలు నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత లతో కలిసి ఆమె పాల్గొన్నారు. తొలుత దక్షిణ బైపాస్ రోడ్డులోని జిల్లా ట్రెజరీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి వెంట మొక్కలు నాటారు. అనంతరం పీటీసీ రోడ్డులోని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏబీసీ సెంటర్ ప్రాంగణంలో వ్యర్థాలతో రూపొందించిన పార్కును కలెక్టర్ ప్రారంభించారు. ఆ ప్రాంగణం మొత్తాన్ని కలియతిరిగి ఆసక్తిగా పరిశీలించారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తున్న విధానాన్ని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. చివరగా కొత్త కూరగాయల మార్కెట్లో మెప్మా మహిళలకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్రంతో, జూట్ తో చేసిన సంచుల వినియోగాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జీరో వేస్ట్ మార్కెట్లుగా వాటిని తీర్చి దిద్దడంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. అనంతరం మెప్మా మహిళలకు, మార్కెట్లో సరుకులు కొనుగోలు కోసం వచ్చిన ప్రజలకు జూట్, వస్త్రంతో చేసిన బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment