అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం
కురిచేడు: మండలంలోని పొట్లపాడు గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై ఎం.శివ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే దొనకొండ నుంచి నాయుడుపాలెం, వీవై కాలనీకి వెళ్లే మట్టిరోడ్డులో పొట్లపాడు పరిధిలోని అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉందని గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు త్రిపురాంతకం సీఐ జి.అస్సాన్, దొనకొండ, కురిచేడు ఎస్సైలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, మూడునాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని అంచనా వేశారు. చిలకపచ్చ రంగు చీర, వంకాయ రంగు లంగా, జాకెట్, కాళ్లకు చెప్పులు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ కారణంగా మృతి చెంది ఉంటుందని సీఐ అస్సాన్ తెలిపారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సమాచారం తెలిసిన వారు ఎస్సై ఎం.శివ (9121102163)ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment