
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి
● కలెక్టర్ తమీమ్‌అన్సారియా
ఒంగోలు సిటీ: విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖాధికారులతో జీఓ 117, డ్రాపౌట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఓ 117ను ఉపసంహరించిన తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించి ఇప్పటికే సన్నాహక మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కూడా సంబంధిత విద్యా శాఖల అధికారులు, పాఠశాలల అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో అధ్యయనం చేశామని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలుపై తల్లిదండ్రులను సంప్రదించి వారికి వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకునేలా ఎంఈఓలు పంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాల కమిటీల సమావేశంలో స్కూళ్ల వివరాలను వారికి అర్థమయ్యేలా వివరించి నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందేలా ఎంఈఓలు చూడాలన్నారు. నిర్దేశించిన గడువు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా విద్యా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. డ్రాపౌట్ పిల్లలు ఎందుకు డ్రాప్ అవుతున్నారో గుర్తించి వారిని బడిలో చేర్పించేలా విద్యా శాఖాదికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఏ కిరణ్ కుమార్, మండల విద్యా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment