అన్ని కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండో విడత పొగాకు వేలం బుధవారం ప్రారంభమైంది. రెండు జిల్లాల్లో కలిపి రెండో విడత 7 వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలోని ఒంగోలు–2 వేలం కేంద్రంతో పాటు వెల్లంపల్లి, టంగుటూరు, కనిగిరి వేలం కేంద్రాల్లో, నెల్లూరు జిల్లాలోని కందుకూరు–2తో పాటు కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో కూడా వేలం నిర్వహించారు. రెండో విడత నిర్వహించిన వేలం కేంద్రాల్లో రైతులు ఆనవాయితీగా ఒక్కో వేలం కేంద్రానికి కేటాయించిన గ్రామాల నుంచి లక్కీ నంబరు 9 వచ్చేలా ఒక్కో రైతు 18 పొగాకు బేళ్లు ట్రాక్టర్లలో వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. తొలిరోజు 1420 బేళ్లు రాగా 15 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. మొత్తం 24 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. రెండు జిల్లాల్లో కలిపి నిర్వహించిన వేలంలో కేజీ పొగాకు అత్యధికంగా రూ.280 పలికింది. అత్యల్పంగా రూ.260కి పడిపోయింది. నిన్నటి వరకు అత్యల్ప ధర రూ.270, రూ.278 వరకు ధర ఒక్కసారిగా రూ.260కి పడిపోయింది.ఈ సంవత్సరం పొగాకు సీజన్ పూర్తవగానే తొలివిడతగా ఈ నెల 10వ తేదీ ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు–1 వేలం కేంద్రంతో పాటు కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు–1 వేలం కేంద్రంలో కూడా ప్రారంభమైంది. రెండో విడత వేలాన్ని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ బ్రహ్మయ్య కూడా ఉన్నారు. వేలం తీరును వ్యాపారులతో కలిసి పరిశీలించారు. ఆయనతో పాటు ఒంగోలు పొగాకు బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు, వేలం కేంద్రం నిర్వహణాధికారి జే.తులసితో పాటు పొగాకు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 7 వేలం కేంద్రాల్లో ప్రారంభం కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్పం రూ.260 ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment