కారును ఢీకొన్న అంబులెన్స్
● రెండు వాహనాల్లో ఉన్న 8 మంది సురక్షితం
సింగరాయకొండ: ముందు వెళ్తున్న కారు వేగం ఒక్కసారిగా నెమ్మదించడంతో వెనుకనే వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి ఢీకొట్టిన సంఘటన సింగరాయకొండలోని కందుకూరు ఫ్లయ్‌ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రెండు వాహనాల్లో మొత్తం 8 మంది ఉండగా ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. మిగిలినవారు సురక్షితంగా ఉన్నారు. హైవే పోలీసుల కథనం ప్రకారం టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంకు చెందిన అమృతకుమార్ తన స్నేహితులు ముగ్గురు, కారుడ్రైవర్ సాయితో కలిసి శ్రీకాళహస్తి వెళ్తున్నారు. కందుకూరు ఫ్లయ్‌ఓవర్ ఎక్కే సమయంలో రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో డ్రైవర్ సాయి కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో వెనకాలే వేగంగా వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. కారు డివైడర్ పైకి ఎక్కగా.. బెలూన్లు తెరుచుకోవటంతో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ సాయిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అంబులెన్స్ విజయవాడలో పేషెంట్‌ను దింపి తిరుగు ప్రయాణంలో బెంగుళూరు వెళ్తోంది. ప్రమాదం ధాటికి కారు ధ్వంసమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment