మీరు రైతులు కాదోయ్..
బేస్తవారిపేట: రైతు విశిష్ట గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలోని రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులందరూ తప్పనిసరిగా 14 అంకెల గుర్తింపు కార్డు తీసుకోవాలంటూ వ్యవసాయశాఖ అధికారులు గత కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు గడువు విధించారు. అయితే సొంత భూములున్న రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం కౌలు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 3,65,755 మంది కాగా పీఎం కిసాన్ పథకం నగదు జమ అవుతున్నవారి సంఖ్య 2,41,454. వీరిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతులు 2,29,565 కాగా పీఎం కిసాన్ పొందుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు 1,70,655 మంది మాత్రమే. జిల్లాలో 2024లో 33,041 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయగా ఈ ఏడాది 45 వేల మందికి కార్డులివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ కొత్త కార్డుల జారీ ప్రక్రియలో అడుగులు ముందుకు పడలేదు.
రైతుల్లో ఆందోళన
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని గుర్తింపు కార్డు ఉంటేనే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణలో పరికరాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ సేద్యంపై రాయితీ, పంట రుణాలు, పెట్టుబడి సాయం లాంటి పథకాలు నేరుగా పొందేందుకు వీలు కలుగుతుంది. నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు లాంటి ఇతర సేవలు పొందవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీతో గడువు ముగియనుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు రైతులు, అసైన్‌మెంట్ భూమి, రిజర్వుడ్ ఫారెస్ట్ భూములు, ఇనామ్ భూముల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌లో అవకాశం కల్పించకపోవడమే రైతులు ఆందోళనకు ప్రధాన కారణం.
ఒక చోటే నమోదు..
ఆన్‌లైన్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఒకచోట మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక రైతు రెండు గ్రామ పంచాయతీల్లో గానీ, ఇతర మండలాల్లో గానీ భూములు కలిగి ఉంటే అలాంటి వారు ఒక్క చోటే నమోదు చేసుకోవాలి. గతంలో ఎన్ని చోట్ల భూములు ఉంటే అన్ని చోట్ల నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఒక చోట నమోదు చేసుకుని మరో చోటికి వెళ్తే ఇది వరకే రిజిస్ట్రేషన్ పూర్తయిందని చూపిస్తోంది.
వలస బాటలో రైతులు
అన్నదాతలకు ఖరీప్, రబీలో సాగు చేసిన పంటలు కలిసిరాలేదు. వాతావరణం అనుకూలించక, తెగుళ్లతో దిగుబడులు పడిపోయాయి. పెట్టుబడులు సైతం చేతికిరాక, పండిన అరకొర పంటలకు ధరల్లేక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. కుటుంబ పోషణ కోసం పిల్లాపాపలతో కలిసి చాలా మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో రైతులను తిప్పలు తెచ్చిన కూటమి ప్రభుత్వం కౌలు రైతులు, అసైన్డ్, ఆర్వోఎఫ్, ఇనామ్ భూముల రైతుల నమోదుకు కొర్రీ ఈ నెల 25తో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు రైతు విశిష్ట గుర్తింపు కార్డు ఉంటేనే పథకాలంటున్న సర్కారు
నాటికీ.. నేటికీ ఎంత తేడా?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భూములున్న రైతులతో పాటు కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందజేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెబుతోంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో మాత్రం కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కౌలు రైతులకు మొండిచెయ్యి చూపినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాయితీ రాదోయ్..!