
నీటి రక్షణకు కృషి చేయాలి
● మంత్రి స్వామి
సింగరాయకొండ: ప్రతిఒక్కరూ నీటి రక్షణకు కృషి చేయాలని, నీటి నిల్వలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కోరారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న రైతువారీ కుంటలకు శనివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్న మంత్రి స్వామి తొలుత కనుమళ్ల పంచాయతీ పెద్దకనుమళ్లలో రైతువారీ కుంటకు శంకుస్థాపన చేశారు. జల రక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సింగరాయకొండ నుంచి మురుగునీరు తమ గ్రామంలోని చెరువులో కలుస్తోందని, ఆ నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి, కలెక్టర్‌ను కోరారు. అనంతరం గురుకుల పాఠశాల వద్ద నూతనంగా రూ.24 వేలతో నిర్మించిన రైతువారీకుంటను వారు ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.