నిబంధనలు తూచ్ !
● ప్రైవేటు బడి బస్సుల ఇష్టారాజ్యం ● శుభకార్యాలకు అద్దెకు.. ● ఫిట్‌నెస్ లేకుండానే రోడ్లపైకి.. ● రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్స్‌లో వెలుగులోకి..
సిరిసిల్లటౌన్: ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులను తరలించేందుకు వినియోగించాల్సిన బస్సులను శుభకార్యాలకు అద్దెకు పంపుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఫిట్‌నెస్ లేని బస్సులను తింపుతున్నాయి. ఇటీవల రవాణా శాఖాధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి.
156 బస్సులు..151 ఫిట్‌నెస్
జిల్లాలోని 13 మండలాల్లో ప్రైవేటు కళాశాలలు, బడులకు సంబంధించిన బస్సులు అధికారికంగా 156 ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది అకాడమిక్ ప్రారంభానికి ముందే 151 బస్సులను ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందినట్లు రవాణాశాఖాధికారులు చెబుతున్నారు. మిగతా ఐదు బస్సుల్లో ఫైనాన్స్ కంపెనీలు, కాలంచెల్లడం తదితర కారణాలతో రోడ్డుపైకి రావడంలేదని పేర్కొంటున్నారు. బస్సుల నిర్వహణపై ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలు ఇవీ..
● స్కూల్ బస్సులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల కమిటీ ప్రతీ 30 రోజులకోసారి ఆ పెట్టెలో మందులు ఉన్నాయా.. లేవా.. అని పరిశీలించాలి.
● బస్సులో మంటల చెలరేగితే ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి.
● బస్సుకు ప్రమాదం జరిగితే చిన్నారులను రక్షించడానికి ఎమర్జెన్సీ డోర్ ఉండాలి.
● బస్సు కిటికీలకు మెస్ లేదా రాడ్స్ ఏర్పాటు చేయాలి.
● కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారినే డ్రైవర్‌గా నియమించుకోవాలి. డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించొద్దు.
● అన్ని బస్సుల్లో అటెండర్లు ఉండాలి.
● విద్యార్థులు బ్యాగులను పెట్టేందుకు లగేజీ స్థలం ఉండాలి.
ఇలా అయితే ఎలా?
● ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సును సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళ్లే సమయానికి ఫైనాన్స్ కంపెనీ వారు అడ్డుకున్నారు. సదరు బస్సు నెలవారీ కిస్తీలు చెల్లించడం లేదని, ప్రభుత్వ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుందని అడ్డుకోగా.. స్థానికులు సర్దిచెప్పడంతో వదిలేశారు.
● ఇల్లంతకుంట మండలం నుంచి ఓ విద్యాసంస్థకు చెందిన బస్సులో రెండు రోజుల క్రితం కోనరావుపేట మండలంలోని ఓ గ్రామానికి శుభకార్యం నిమిత్తం ప్యాసింజర్లను తరలిస్తుండగా రవాణాశాఖ అధికారి పట్టుకుని కేసు నమోదు చేశారు.
● జగిత్యాల జిల్లాకు చెందిన ఓ విద్యాసంస్థ బస్సు రోడ్‌ట్యాక్స్ చెల్లించకుండా విద్యార్థులను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
నిబంధనలు పాటించాలి
పాఠశాలల బస్సులను సకాలంలో ఫిట్‌నెస్ చేయించాలి. విద్యార్థులకు రక్షణ కల్పించే క్రమంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే అధిక మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను విద్యార్థులను ఇంటి నుంచి విద్యాసంస్థకు తీసుకొచ్చి వెళ్లేందుకే వినియోగించాలి. లేని పక్షంలో కేసులు చేస్తాం. బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల పరివర్తన తదితర విషయాలపై తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించాలి.
– వంశీధర్, ఇన్‌చార్జి రవాణాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment