
‘పది’లో ప్రథమ స్థానమే లక్ష్యం
● పరీక్షలపై పరేషాన్ వద్దు ● విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి ● మేధస్సుకు మార్కులు కొలమానం కాదు ● జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు
సిరిసిల్లఎడ్యుకేషన్: అభ్యసించడం నుంచి కొనుక్కోవడం వైపు విద్యా విధానం పయనిస్తున్న తీరు బాధాకరమని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అన్నారు. ఇటీవల డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు.
పరీక్షల్లో రాణించాలంటే..
విద్యార్థులు పరీక్షల్లో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పిల్లల ప్రగతిని పరిశీలించడం తల్లిదండ్రులకు పెను సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు కచ్చితంగా విద్యార్థుల ప్రగతిపై దృష్టి పెట్టాలి. అప్పుడే మంచి విలువలతో కూడిన విద్య, విజ్ఞానం పిల్లలకు చేరువవుతుంది.
మార్కులు కొలమానం కాదు
విద్యార్థులకు వివిధ పరీక్షల్లో వచ్చే మార్కులను కొలమానంగా చూపుతూ కార్పొరేట్ స్కూళ్లు చదువును వ్యాపారంగా మార్చాయి. మార్కుల పరంగా కాకుండా మాట్లాడే తీరు, సంభాషణ విధానంలో ప్రావీణ్యతను కలిగి ఉండేలా పరిశీలన జరగాలి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించి..
పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఇప్పటికే మూడో స్థానంలో ఉంది. మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేస్తాం. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేశాం.
పరీక్ష నిర్వహణపై..
జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు 35 కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్స్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తోపాటు జిల్లా కలెక్టర్, డీఈవో, పరీక్షల నియంత్రణ అధికారి, రాష్ట్ర పరిశీలకులు విధుల్లో ఉండి మాస్ కాపీయింగ్ జరగకుండా పర్యవేక్షిస్తారు.
సందేహాల నివృత్తికి..
విద్యార్థులకు పరీక్షల సమయంలో తలెత్తే సందేహాలపై 94414 40849 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ పరీక్షల్లో మమేకమయ్యేలా చూడాలి.
మార్కుల విధానం మంచిదే..
పదో తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ రద్దుచేసి మార్కుల విధానం స్వాగతించే అంశం. ఇంటర్నల్ మార్కుల విషయంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టారీతిగా విద్యార్థులకు మార్కులు వేశాయి. జీపీఏ విధానం రద్దు చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. మార్కుల కోసం అభ్యసన చేయాలని విద్యార్థులపై పదేపదే ఒత్తిడి చేసే విధానం తగ్గించాలి. వారికి అర్థమయ్యే రీతిలో సలహాలు, సూచనలు చేస్తూ మంచి ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలి.
పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతం
2021–22 96.34
2022–23 94.37
2023–24 98.27 శాతం
ఈ ఏడాది జిల్లాలో పరీక్ష రాయనున్న
మొత్తం విద్యార్థులు 6,768

‘పది’లో ప్రథమ స్థానమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment