వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్సీగా..
నవీన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం
నందిగామ మండలం మొదళ్లగూడ స్వగ్రామం
నవీన్‌రెడ్డి గెలుపుతో బీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం
షాద్‌నగర్: వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించాడు.. రాజకీయ ప్రావీణ్యతకు పదును పెట్టాడు.. యువనేతగా మొదలై జన నేతగా ఎదిగి అనతి కాలంలోనే ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించాడు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం అందుకున్నాడు నాగర్‌కుంట నవీన్‌రెడ్డి. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామానికి చెందిన నాగర్‌కుంట శోభారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి దంపతుల రెండో కుమారుడైన నవీన్‌రెడ్డి చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 2006లో రాజకీయ అరంగ్రేటం చేసి అప్పట్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపుతోపాటు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తూరు జెడ్పీటీసీగా విజయం సాధించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జెడ్పీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నవీన్‌రెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరిగింది.
111 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
ఎమ్మెల్సీ బరిలో బీఆర్‌ఎస్ నుంచి నవీన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో దిగారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్ కళాశాలో లెక్కింపు జరిగింది. మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 చెల్లనవిగా అఽధికారులు గుర్తించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక ఓటు మాత్రమే పోలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించేందుకు 709 ఓట్లు రావాల్సి ఉండగా నవీన్‌రెడ్డికి కోటా కన్న 53 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు నవీన్‌రెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో నవీన్‌రెడ్డి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.
నవీన్‌రెడ్డిని అభినందించిన కేసీఆర్
ఎమ్మెల్సీగా విజయం సాధించిన నాగర్‌కుంట నవీన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నవీన్‌రెడ్డికి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీగా నవీన్‌రెడ్డి విజయం సాధించడంతో బీఆర్‌ఎస్ నేతల్లో కొత్త ఉత్సహం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment