
పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి
చేవెళ్ల: స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్లలో ఇంకా పేదలు గూడు కోసం పోరు చేయాల్సిన దుస్థితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని 75 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో రెండేళ్లుగా గుడిసెలు వేసుకొని పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అక్కడ రామస్వామి మాట్లాడుతూ.. రెండేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేస్తున్నారని, వారికి ఎర్రజెండా అండగా నిలబడిందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కనీస సౌకర్యాలు సైతం లేకుండానే రెండేళ్లుగా గుడిసెల్లో పేదలు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. పట్టాల కోసం భూపోరాటం చేస్తున్న పేద ప్రజలకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గుడిసెల్లో ఉండే పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్తిరెడ్డి, ప్రభులింగం, సుధాకర్‌గౌడ్, అంజయ్య, శ్రీనివాస్, జంగయ్య, మక్బుల్, మంజుల, శివ, సుగుణమ్మ, రమాదేవి, పెంటయ్య, శ్రీకాంత్, యాదగిరి, గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి
Comments
Please login to add a commentAdd a comment