రైతు లేనిదే రాజ్యం లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: అన్నంపెట్టే అన్నదాత లేనిదే రాజ్యం లేదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్యతో కలిసి హైదరాబాద్ డీసీసీబీ బ్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాకు డీసీసీబీ బ్యాంకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎకరా స్థలంలో రూ.10 కోట్లతో అత్యాధునికంగా భవనం నిర్మిస్తే.. రూ.100 కోట్ల ఆస్తి అవుతుందని తెలిపారు. 9 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు రూ.600 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతుందని తెలిపారు. నాలుగు జిల్లాల కర్షకులకు కష్టకాలంలో నిధులు సమకూరుస్తూ.. అండగా నిలుస్తుందని వెల్లడించారు. రుణాలు, వడ్డీలు ముఖ్యం కాదని, రైతుల ప్రయోజనమేనని స్పష్టంచేశారు. దేశంలో అతిపెద్ద మార్కెట్ బాటసింగారంలో నిర్మిస్తున్నట్లు వివరించారు.
ఆదర్శ డీసీసీబీగా నిలపాలి
‘గతంలో డీసీసీబీలో అప్పు తీసుకుంటే భయం ఉండేది. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నాం. డీసీసీబీలను టెస్కాబ్‌కు అనుసంధానం చేసి ఆధునికీకరించాము’ అని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రతి సొసైటీకి రూ.50 లక్షల రుణాలు ఇచ్చి, ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోనే ఆదర్శ వంతమైన డీసీసీబీగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, సీఈఓ భాస్కర్ సుబ్రహ్మణ్యం, డీసీఓ సుధాకర్, జీఎంలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీరామ్, డీజీఎంలు కిరణ్‌కుమార్, సతీష్‌రెడ్డి, నాగాంజలి, ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, ఈసీ శేఖర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.
కర్షకుల ప్రయోజనమే ముఖ్యం
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
హైదరాబాద్ డీసీసీబీ బ్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment