గ్రామాలు గప్‌చుప్
స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఆశావహుల ఆవేదన ● ఇప్పటికే ప్రజల మద్దతుకు రూ.లక్షలు ఖర్చు ● ప్రస్తుతం జనాల్లో తిరగకుండా పోటీదారుల పాట్లు
యాచారం: గ్రామాల్లో అంతా గప్‌చుప్ వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధమైన ఆశావహులు నేడు ప్రజల మధ్యన కనిపించని పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవ్వడమే. స్థానిక సంస్థల పోరుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చకచక పూర్తి చేయడం, త్వరగా ఎన్నికలు ఉంటాయనే సాంకేతాలతో గ్రామాల్లో ఆశావహుల హడావుడి మొదలైంది. రిజర్వేషన్లు కలిసోస్తే సర్పంచ్ లేదా ఎంపీటీసీగా పోటీ చేసి గెలుస్తామనే ధీమాతో పోటీదారులు గ్రామాల్లో హంగామా సృష్టించారు. ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం పిలువకున్నా వాళ్ల ఇళ్లకు వెళ్లి బాగున్నావా పెద్దమ్మ... పెద్దనాన్న... తమ్ముడు ఏం చేస్తున్నాడు.. చెల్లిలు ఇంటికొస్తుందా అంటూ ఆత్మీయ పలకరింపులు చేశారు. కొందరైతే గ్రామాల నుంచి ఉద్యోగ, వ్యాపార రీత్యా నగరంలో ఉన్న వాళ్లను కలిసి మద్దతు కూడగట్టుకోవడమే కాక, ఫోన్లు చేసి అన్నా.. ముందు అడుగుతున్నా.. నాకే నీ మద్దతు కావాలి.. అంటూ కాళ్ల బేరమాడారు.
సిద్ధం చేసుకున్న ఆర్థిక వనరులు
రాత్రి, పగలు ప్రజలకు సేవ చేసినా.. ఆపదకు ఆదుకున్నా సరే.. ఎన్నికలప్పుడు ప్రజలకు పచ్చనోటు ఇవ్వనిదే ఓట్లు రాలవనే భావన నేతల్లో ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే ఆశతో గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధమైన ఆశావహులు కావాల్సిన డబ్బును సిద్ధం చేసి పెట్టుకున్నారు. యాచారం మండలంలోనే చూసుకుంటే 24 గ్రామ పంచాయతీలు, 14 ఎంపీటీసీలు ఉన్నాయి. మొత్తం 50,975 ఓటర్లు ఉన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలైన మాల్, యాచారం, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, గునుగల్, కొత్తపల్లి, మంతన్‌గౌరెల్లి, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి, తక్కళ్లపల్లి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో పోటీలో ఉండటానికి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకు పైగానే సిద్ధం చేసుకున్నట్లు వినికిడి. ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు వస్తే రూ.50 లక్షల్లోపు ఖర్చు, జనరల్ అయితే మాత్రం రూ.కోటి వరకు ఖర్చు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఆశావహులంతా వ్యవసాయ భూములు, ప్లాట్లను తక్కువ ధరలకు అమ్మి కొందరు డబ్బులు జమ చేసుకోగా, మరికొందరైతే రూ.5కు చొప్పున వడ్డీకి డబ్బులు మాట్లాడుకుని తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. ఎన్నికలు కోడ్ వస్తే డబ్బులు పోగు చేసుకోవడం కష్టంగా మారుతుందని గ్రామాల్లోని తెలిసినవాళ్ల వద్ద డబ్బులు దాచి పెట్టుకున్నారు.
ఎన్నికల లేవని ఆందోళన
స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన తర్వాతే ఉంటాయనే సాంకేతాలతో ఆశావహులు లబోదిబోమంటున్నారు. ‘ఎన్నికల కోసమే అప్పులు చేశాం.. వ్యవసాయ భూములు, ప్లాట్లు అమ్మినాం.. రిజిస్ట్రేషన్లు చేసి రూ.5కు వడ్డీకి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాపోటీలు, మహిళలకు చీరలు, దేవాలయాల నిర్మాణాలకు చందాలు, నిత్యం ఓ కాలనీలో విందులు, యాత్ర పర్యటనల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రామలతో పేరుతో రూ.లక్షలాధి ఖర్చు చేశారు. పార్టీల వారీగా కూడా పెద్ద నేతలను మచ్చిక చేసుకోవడం కోసం నిత్యం దావత్‌లు ఇచ్చారు. నిప్పుల మీద నీళ్లు పోసినట్లుగా సర్కార్ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని సాంకేతాలతో ఇన్నాళ్లు ప్రజలకు దావత్‌లు ఇచ్చిన ఆశావహులంతా కొద్ది రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment