చేవెళ్ల: వారంతా సర్కార్ బడిలో ఓనమాలు దిద్దారు.. అంచలంచెలుగా ఎదిగి జీవితంలో స్థిరపడ్డారు.. 50 ఏళ్ల కాలంలో కలిసి చదువుకున్న వారంతా ఒక్కచోట చేరారు.. జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు.. వయసును మరిచి, హోదాలను పక్కన పెట్టి ఆటపాటలతో సందడి చేశారు.. ఈ అ‘పూర్వ’ ఘట్టానికి చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా మారింది. ఈ పాఠశాలలో 1955 నుంచి 2005 వరకు 50 ఏళ్ల కాలంలో కలిసి చదువుకున్న వివిధ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవాలను సంబరంగా జరుపుకొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.
అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి..
వేడుకలకు 1955 నుంచి 1980 వరకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. వారిని ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం సత్కరించారు. చాలాకాలం తర్వాత అంతా కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వేడుక తమ జీవితంలో ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని పలువురు పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి కలిసి కృషి చేస్తామని ప్రకటించారు. ఆరు నెలలుగా 1981–82 బ్యాచ్ విద్యార్థులు చేసిన కృషితో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఇలాంటి వేడుక ఎప్పుడూ చూడలేదని పూర్వ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఆ నాడు తాము చదువులు చెప్పిన విత్తనాల్లాంటి విద్యార్థులు నేడు మహావృక్షాలుగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థి శ్రీనివాస్‌గౌడ్ తన ఆర్కెస్ట్రా బృందంతో ఆలపించిన పాటలు అలరించాయి. వేడుకకు సహకారం అందించిన దాతలు కృష్ణారెడ్డి, దేవర వెంకట్‌రెడ్డి, ఆగిరెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయలు బుగ్డారెడ్డి, మల్లయ్యగౌడ్, ఖుర్షీద్ అలీ, నర్సింలు, గాంధీ, పద్మ, సులోచన, భానుమతి, నిర్వాహకులు ఆర్.శ్రీనివాస్, బురాన్ ప్రభాకర్, గోపాలచారి, షఫీ, వెంకట్‌రెడ్డి, మాణిక్యం, పెంటయ్య, ఖాజాపాషా, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో 50 ఏళ్ల సంబరం
అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవాలు
సందడి చేసిన అప్పటి విద్యార్థులు
చేవెళ్ల పాఠశాలలో అ‘పూర్వ’ ఘట్టం
Comments
Please login to add a commentAdd a comment