
మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి
ఆరుగురు యువకుల అరెస్ట్
బంజారాహిల్స్: మద్యం మత్తులో ఆరుగురు యువకులు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బోరబండ అన్నానగర్ సైట్–3లో నివసించే ప్రసాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఓ వీవీఐపీకి డ్రైవర్‌గా అటాచ్ అయ్యాడు. ఆదివారం రాత్రి అతను ఇందిరానగర్‌లోని అమృతాబార్ నుంచి బయటికి వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు గొడవపడుతుండటంతో అక్కడికి వెళ్లిన ప్రసాద్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు నీవెవరు మాకు చెప్పేందుకు అంటూ అతడిపై దాడి చేయడమే కాకుండా తమ స్నేహితులు మరో ఐదుగురిని అక్కడికి పిలిపించారు. అకారణంగా ఏడుగురు కలిసి ప్రసాద్‌ను చితకబాదడమేగాక అతడి మెడలో ఉన్న బంగారు గొలుసు, రిస్ట్‌వాచ్ లాక్కున్నారు. అదే సమయంలో పోలీసు వాహనం వస్తుండటాన్ని గుర్తించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే బాధితుడు స్కూటర్ నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు అందజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను శ్రీకృష్ణానగర్ ప్రాంతానికి చెందిన తనాల సాయికిరణ్, ప్రణీత్‌గౌడ్, నందిపాటి నవీన్, బండి సత్యకిరణ్, పందగడ శ్రీనివాస్‌గా గుర్తించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సలీం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాధితుడు అధికార పార్టీకి చెందిన ప్రముఖురాలి వద్ద పని చేస్తుండటంతో కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంగనాథ్‌రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందుకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్‌స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేధింపులు తాళలేకే..
యువకుడి హత్య కేసులో నిందితుల రిమాండ్
మేడ్చల్‌రూరల్: మేడ్చల్ పట్టణంలో ఆదివారం జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌న్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, సోమారపుపేట గ్రామానికి చెందిన గుగులోతు గన్యా పెద్ద కుమారుడు ఉమేశ్ (24) మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అతడి సోదరుడు రాకేశ్, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, బంధువులు బుక్యా నవీన్, బుక్యా నరేశ్, బుక్యా సురేశ్‌తో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ కాలనీలోని అతడి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ సందర్భంగా నవీ, నరేశ్, సురేశ్ ఉమేష్‌ను పట్టుకోగా రాకేశ్, లక్ష్మణ్ కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఉమేష్ పారిపోతుండగా అతడిని వెంబడించిన రాకేశ్, లక్ష్మణ్ మేడ్చల్ బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో పొడిచి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు సోమవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్‌న్లు, రెండు కత్తులు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు ఉమేశ్‌కు నేర చరిత్ర ఉందని, అతడిపై కామారెడ్డి జిల్లాలో 14 కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును గంటల వ్యవధిలో ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డీఐ సుధీర్ కృష్ణ, ఎస్సై మన్మథరావును డీసీపీ అభినందించారు.

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి
Comments
Please login to add a commentAdd a comment